కరోనా తర్వాత భారత్‌కు ఎన్నో అవకాశాలు: టాటా చంద్రశేఖరన్
ముంబై: కరోనా మహమ్మారి తర్వాత భారత్‌కు మంచి అవకాశాలు ఉంటాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మున్ముందు భారత్‌కు ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతుందన్నారు. వాటిని భారత్ ఒడిసిపట్టాలని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. 2020వ దశకం ఇక భారత్‌దే అని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరు గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డేటా ధరలు అందుబాటులో ఉండేలా..
కొత్త ప్రపంచంలో డేటా, బ్యాండ్ విడ్త్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్ అన్నారు. ప్రతి గ్రామానికి సరిపడా బ్యాండ్ విడ్త్, అందుబాటులో ధరలో డేటా అందేలా చూడాలన్నారు. పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం కొనసాగాలన్నారు. ఈ బంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్‌ను సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. సమాచార గోప్యత, సమాచార స్థానికీకరణ, సైబర్ పన్నుల విషయంలో ప్రభుత్వ పటిష్ట నియంత్రణ ప్రమాణాలు రూపొందించాలన్నారు.

2020 దశాబ్దం భారత్‌దే
2020 దశాబ్దం భారత్‌కు చెందినదని గ్రహించాలన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పారు. కరోనా తర్వాత కొత్త ప్రపంచంలోకి భారత్‌ను సిద్ధం చేయాలన్నారు. భారత్‌కు విపరీతమైన, అపరిమితమైన అవకాశాలు ఉంటాయన్నారు. విద్యుత్ కొరత, రవాణా, నైపుణ్యం కలిగిన కార్మికులు, భారీ వడ్డీ రేట్ల వంటి సమస్యలు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నామన్నారు.

అవకాశాలపై దృష్టి
అన్నింటిని అధిగమించి ఇకపై కొత్త ప్రపంచంలో రాబోతున్న అవకాశాలను దక్కించుకోువడంపై దృష్టి సారించాలని చంద్రశేఖరన్ అన్నారు. భవిష్యత్తులో రోబోటిక్స్, కృత్రిమమేధ వంటి కొత్త సాంకేతికతలు ఉత్పత్తి రంగంలో కీలకం కానున్నాయన్నారు. భారత్‌లో పుష్కలంగా ఉన్న మానవ వనరులు అంతర్జాతీయ సరఫరా గొలుసును అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడతాయన్నారు.


Click it and Unblock the Notifications