రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పేపర్ నోట్లు రద్దుపై కీలక ప్రకటన..
కాగితపు కరెన్సీ కంటే మెరుగైన మన్నిక, ఎక్కువ కాలం మనుగడ సాగించే పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల (Field Trials) కోసం ప్రవేశపెట్టాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా ప్రారంభంలో రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కో బిలియన్ చొప్పున పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే వీటిని క్రమం తప్పకుండా జారీ చేయాలని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా భర్తీ చేసే ఆలోచన ఏదీ లేదని.. కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ పాలిమర్ నోట్లను కూడా చలామణిలోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాలిమర్ నోట్ల ఉత్పత్తి కోసం అంతర్నిర్మిత భద్రతా లక్షణాలతో కూడిన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లను సరఫరా చేయడానికి ఆర్బీఐకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ఇప్పటికే గ్లోబల్ టెండర్లను (EoI) ఆహ్వానించింది. ప్రారంభంలో సుమారు 68 వేల రీముల పాలిమర్ సబ్‌స్ట్రేట్ అవసరమని అంచనా వేశారు. ఈ టెండర్ ప్రక్రియలో కఠినమైన జాతీయ భద్రతా నిబంధనలను పొందుపరిచారు.
సరఫరాదారులు చైనా లేదా పాకిస్తాన్‌ల నుండి ముడి పదార్థాలను సేకరించకూడదని, అలాగే భారత్ కోసం తయారుచేసిన సబ్‌స్ట్రేట్‌ను ఏ మూడవ దేశానికి సరఫరా చేయకూడదని షరతులు విధించారు. ప్రయోగాలు పూర్తయ్యాకే డిజిటల్ లావాదేవీలపై దీని ప్రభావాన్ని అంచనా వేయగలమని.. డిజిటల్ చెల్లింపులు, భౌతిక కరెన్సీ నోట్లు పరస్పరం ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలలో ఇప్పటికే వాడుకలో ఉన్న ఈ పాలిమర్ నోట్లు మన్నికైన ప్లాస్టిక్ ఫిల్మ్‌లతో తయారవుతాయి. ఇవి మురికి కాకుండా, నీటిలో తడవకుండా, చిరిగిపోకుండా సాంప్రదాయ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, తద్వారా పదే పదే కొత్త నోట్లను ముద్రించే ఖర్చు తగ్గుతుందని అంతర్జాతీయ అధ్యయనాలు నిరూపించాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణపై ఆర్బీఐ వ్యయం 24 శాతం తగ్గి రూ. 4,875 కోట్లకు చేరుకున్నప్పటికీ.. దేశంలో నగదుకు డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
మార్చి 2026 చివరి నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 12 శాతం పెరిగి రూ. 41.23 లక్షల కోట్లకు చేరుకోగా, అందులో ఏకంగా 86 శాతం వాటాతో రూ.500 నోటు ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నట్లుగా.. ప్రాథమిక చర్చల అనంతరం తక్కువ విలువ కలిగిన నోట్లను పాలిమర్‌లోకి మార్చడం ద్వారా కరెన్సీ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications
