భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీకి తొలి అడుగు.. రూ. 10, రూ. 20 పాలిమర్ నోట్లపై కేంద్రం కీలక నిర్ణయం
కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో ఎక్కువ కాలం మన్నికగా ఉండే పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయి ప్రయోగాల్లో భాగంగా వంద కోట్ల (ఒక బిలియన్) చొప్పున రూ.10, రూ.20 డినామినేషన్ల పాలిమర్ నోట్లను జారీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఆర్‌బిఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సుల మేరకు.. 1934 ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈ కొత్త పాలిమర్ నోట్లను కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటి కొనుగోలు ప్రక్రియ ప్రాథమిక దశలో ఉన్నందున.. పాలిమర్ నోట్లను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టడానికి పట్టే కచ్చితమైన కాలపరిమితిని లేదా దానికి అయ్యే వ్యయాన్ని ఈ దశలో చెప్పడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

అదే సమయంలో దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులపై మాట్లాడిన ఆర్థిక మంత్రి, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా కొలిచే సగటు రిటైల్ ద్రవ్యోల్బణం గత కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చిందని పేర్కొన్నారు. 2023-24లో 5.4 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, 2024-25లో 4.6 శాతానికి, ఆ తర్వాతి సంవత్సరం 2.1 శాతానికి క్రమంగా తగ్గింది.
అయితే పశ్చిమాసియా సంక్షోభం, పెరిగిన అంతర్జాతీయ ఇంధన ధరలు, కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు, ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.9 శాతానికి చేరినప్పటికీ, ఇది ఆర్‌బిఐ నిర్దేశించిన 4 శాతం పరిమితి కంటే తక్కువగానే ఉందని ఆమె వివరించారు.
సామాన్య, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం పరోక్ష, ప్రత్యక్ష పన్నుల్లో భారీ సంస్కరణలు చేపట్టిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ 56వ సమావేశంలో 18 శాతం ప్రామాణిక రేటు, 5 శాతం మెరిట్ రేట్లతో కూడిన రెండు-రేట్ల విధానాన్ని ప్రతిపాదించడం ద్వారా అనేక వస్తువులపై పన్ను భారాన్ని హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.
దీనికి తోడు 2026 ఫిబ్రవరి నుండి అమలులోకి వచ్చేలా ఫిబ్రవరి 2026 బడ్జెట్‌లో పలు ముడిసరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించడమే కాక.. వంటనూనెలపై సెస్సులను, అలాగే పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి నిత్యవసరాల ధరలను అదుపులోకి తెచ్చామని స్పష్టం చేశారు.
మరొకవైపు వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు (జీతం పొందే ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపులతో కలిపి రూ. 12.75 లక్షల వరకు) ఆదాయపు పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రజల చేతుల్లో వినియోగ ఆదాయం పెరిగిందని ఆమోదం తెలిపారు.
ఈ చర్యల ఫలితంగా జీడీపీలో ప్రైవేట్ తుది వినియోగ వ్యయం దాదాపు 56.7 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోందని, తలసరి ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (PFCE) 2023-24లోని 4.8 శాతం నుండి 2025-26 నాటికి 6.8 శాతానికి బలమైన వృద్ధిని నమోదు చేసిందని మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో కూడా మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె సభకు హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications
