5 లక్షల ఎకరాలు సిద్ధం, ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు: నిర్మల సీతారామన్
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (మే 16) టూరిజం, ట్రాన్సుపోర్ట్ రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఐదు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఇరవై లక్షల కోట్ల రూపాయల మెగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు రోజులుగా వివిధ రంగాలకు కేటాయించిన ఉద్దీపనలను నిర్మల ప్రకటిస్తున్నారు. పరిపాలనా సంస్కరణల్లో ప్రధాని మోడీ ముందుంటారని చెప్పారు. తీవ్ర పోటీని ఎదుర్కోవడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో పోటీకి అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. ఈ రోజు ఎనిమిది రంగాల గురించి ప్యాకేజీ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ ట్రావెల్, ఎయిరోస్పేస్ మేనేజ్‌మెంట్, ఎయిర్ పోర్ట్స్, బొగ్గు, ఖనిజాలు, స్పేస్ (ఇస్రో) రక్షణ ఉత్పత్తులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీపై కూడా ప్యాకేజీ ప్రకటించారు.

ఒకే దేశం.. ఒకే మార్కెట్
చాలా రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సంస్కరణల ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తామన్నారు. పెట్టుబడుల ఆకర్షణ లెక్కన రాష్ట్రాలకు ర్యాంకులు ఉంటాయన్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు అందించే అంశాల్లో తమ ప్రభుత్వం ముందు ఉందన్నారు.

5 లక్షల ఎకరాల భూమి సిద్ధం
బ్యాంకుల ద్వారా క్రోనీ క్యాపిటలిస్టులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 5 లక్షల ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధం చేసి పెట్టినట్లు చెప్పారు. భారత్‌లో తయారీ ద్వారా ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు. ఉదయ్ పథకం ద్వారా చిన్న నగరాలకు విమాన సర్వీసులు నడిపిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు నూతన సంస్కరణలు ఉపయోగపడతాయన్నారు.

బొగ్గుపై ప్రకటన
సోలార్ ప్లేట్స్ ఉత్పత్తికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు ఉంటాయన్నారు. గడువులోగా బొగ్గు సరఫరా చేసిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బొగ్గు సరఫరా ఉంటుందన్నారు. బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన టెక్నాలజీ వినియోగిస్తామన్నారు.


Click it and Unblock the Notifications