Tirumala: తిరుమలలో దళారి ముఠా అరెస్ట్.. అక్రమంగా గదులు పొంది అధిక ధరకు విక్రయిస్తున్న నిందితులు..
కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. తిరుమల కొండ ఎప్పుడూ భక్తులతో కలకలలాడుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో మోసాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా తిరుమలలో కొత్త స్కాం బయటకు వచ్చింది. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న దళారుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరుగురు దళారులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నిందితుల దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా సభ్యులు భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతున్నారు. వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 08న ఉదయం తిరుమల సీఆర్వో కార్యాలయం దగ్గర అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు గుర్తించారు.

ఆ గదులను భక్తులకు అధిక ధరలకు అక్రమంగా అద్దెకు ఇచ్చి వేల రూపాయలు సంపాదిస్తున్నారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా, తిరుమలలోని PAC-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో తేలింది. ముఠాలో బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) అనే ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల కోసం ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు,అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని కోరుతున్నారు. అలాగే అధికారి వెబ్ సైట్, యాప్ ల్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications