SBI Fraud: ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్ల గురించి వినే ఉంటాం. జనం డబ్బు తస్కరించేందుకు ఇదొక ప్రఖ్యాత మార్గం. అయితే ఇప్పుడు దొంగలు ఏకంగా రూట్ మార్చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడులో కొందరు నిందితులు ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి దీనిని ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. గడచిన మూడు నెలలుగా దీనిని వారు నడుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ఒకరు మాజీ బ్యాంక్ ఉద్యోగి కుమారుడని పోలీసులు గుర్తించారు.

దీనికి అసలు సూత్రధారి కమల్ బాబు. బాబు తల్లిదండ్రులిద్దరూ గతంలో బ్యాంకు ఉద్యోగులు కాగా.. అతని తండ్రి 10 ఏళ్ల కిందటే మరణించారు. తల్లి రెండేళ్ల కిందట పదవీ విరమణ పొందారు. ఇక రెండవ నిందితుడు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుండగా, మూడో నిందితుడు రబ్బర్ స్టాంపులు ముద్రించేవాడని పోలీసులు వెల్లడించారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్న వ్యక్తి బ్యాంకుకు అవసరమైన నకిలీ చలాన్లు, ఇతర డాక్యుమెంట్లను ముద్రించగా.. మరో నిందితుడు నకిలీ స్టాంపులను సిద్ధం చేయటంతో ఇందులో పాల్గొన్నట్లు వెల్లడైంది.
వాస్తవానికి ఒక ఎస్‌బీఐ ఖాతాదారుడు పన్రుటిలోని బ్రాంచ్‌ను సందర్శించి నిజమైన ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో నకిలీ బ్రాంచ్‌పై అనుమానం వచ్చింది. కొత్త బ్రాంచ్ గురించి తెలిసి ఎస్బీఐ జోనల్ అధికారులు కూడా షాక్ అయ్యారు. అలా నకిలీ స్టేట్ బ్యాంక్ శాఖ ఏర్పాటు విషయం బయటపడింది. పనరుతిలో ఇప్పటికే రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఉన్నాయి. అయినా నేరగాళ్లు సొంతంగా నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. మూడో బ్రాంచ్ గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. దీంతో విషయాన్ని వారు పోలీసులకు వెల్లడించారు. అయితే ఇక్కడ ఎలాంటి లావాదేవీలు జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications