Banking News: ఖాతాదారులకు PNB హెచ్చరిక.. అలా చేయకపోతే మీ అకౌంట్ మర్చిపోవాల్సిందే..
PNB News: ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలను తెరిపించింది. ఇవేకాక ప్రజలకు పలు బ్యాంకుల్లోనూ అకౌంట్స్ ఉన్నాయి. అయితే వాటిలో ఒకటో, రెండో మినహా ఎక్కువగా ఎవరూ వినియోగించడం లేదు. అలా స్తబ్ధుగా పడిఉన్న ఖాతాలపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఖాతాదారులు తమ బ్యాంక్ అకౌంట్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పిలుపునిచ్చింది. ఏళ్ల తరబడి వాడకుండా వదిలేసిన ఖాతాలను భవిష్యత్తులో ఉపయోగించాలనుకునే కస్టమర్‌ల కోసం పలు సూచనలు చేసింది. మే 31, 2024లోపు KYC ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి అని తెలిపింది.

లేని పక్షంలో గత 3 సంవత్సరాలుగా ఎటువంటి లావాదేవీలు జరపకుండా మరియు బ్యాలెన్స్ లేకుండా ఉన్న ఖాతాలన్నింటినీ జూన్ 1, 2024న మూసివేస్తామని PNB ప్రకటించింది. ఆ తేదీ తర్వాత ఖాతాదారులకు ఎటువంటి నోటీసులు ఇవ్వబడవని స్పష్టం చేసింది. ఏప్రిల్ 30, 2024ను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు చెప్పింది.
అయితే డీమ్యాట్ ఖాతాలకు లింక్ చేయబడిన, లాకర్లు లేదా యాక్టివ్ స్టాండింగ్ సూచనలు వంటి కొన్ని ఖాతాలకు ఈ మూసివేత నుంచి మినహాయింపు ఉందని బ్యాంక్ తెలిపింది. 25 ఏళ్లలోపు కస్టమర్ల కోసం విద్యార్థి ఖాతాలు, మైనర్ ఖాతాలు, PMJJBY, PMSBY, SSY, APY, DBT వంటి నిర్దిష్ట పథకాల కోసం తెరవబడిన ఖాతాలు మరియు కోర్టు ఉత్తర్వులు, ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు లేదా ఇతర చట్టబద్ధమైన అధికారుల ద్వారా స్తంభింపజేయబడిన ఖాతాలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఇలా నిరుపయోగంగా ఉన్న ఖాతాలు హ్యాకింగ్ వంటి మోసాలకు ప్రధాన టార్గెట్స్‌గా మారవచ్చని బ్యాంక్ హెచ్చరించింది. అంతేకాకుండా అనేక బ్యాంకులు క్రియాశీలకంగా లేని ఖాతాల నుంచి నిర్వహణ రుసుములను వసూలు చేస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేయడానికి కస్టమర్‌లు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి అవసరమైన KYC పత్రాలను సమర్పించాలని PNB కోరింది.


Click it and Unblock the Notifications