IPO News: జ్యూవెలరీ ఐపీవో బంపర్ లిస్టింగ్.. 73 శాతం లాభంతో మార్కెట్లోకి అడుగు.. వావ్..
PN Gadgil Jewellers IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఈవారం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఐపీవోలు తమ ప్రభంజనాన్ని నేడు చూపించటం ప్రారంభించాయి. ఈ క్రమంలో నిన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు తమ ప్రతాపాన్ని లిస్టింగ్ తర్వాత చూపించగా.. నేడు జ్యూవెలరీ స్టాక్ సైతం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లను ఖుషీ చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పీఎన్ గాడ్గిల్ జ్యూవెలరీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు ఎన్ఎస్ఈలో 73 శాతం ప్రీమియంతో రూ.830 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇదే క్రమంలో బీఎస్ఈలో షేర్లు రూ.843 రేటు వద్ద 73.75 శాతం లాభంతో ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ప్రస్తుతం గోల్డ్ స్టాక్స్ బూమ్ కొనసాగుతున్న వేళ మార్కెట్లోకి అడుగుపెట్టిన గాడ్గిల్ స్టాక్ ఆ ప్రయోజనాలను అందుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,100 కోట్లను విజయవంతంగా సమీకరించింది.

వాస్తవానికి ఇష్యూ సమయంలో కంపెనీ తన ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.480 గరిష్ఠ రేటుకు విక్రయించింది. ఈ క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.330 కోట్లను కంపెనీ రెయిజ్ చేసింది. అయితే మెుత్తం ఐపీవోలో రూ.250 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు విక్రయించారు. ఐపీవో నుంచి వచ్చిన మెుత్తంలో రూ.393 కోట్లను కంపెనీ మహారాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు వినియోగించాలని నిర్ణయించింది. అలాగే రూ.300 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగిస్తుండగా, మిగిలిన మెుత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించాలని ప్లాన్ చేసింది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే జూన్ 31 నాటికి దేశవ్యాప్తంగా 39 రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. వీటిని పీఎన్‌జీ పేరుతో కొనసాగిస్తుండగా, ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. వాస్తవానికి మార్కెట్ విశ్లేషకులు ఊహించిన 50-63 శాతం కంటే అధిక ప్రీమియం ధరకు పీఎన్ గాడ్గిల్ జ్యూవెలరీ షేర్లు మార్కెట్లోకి అడుగుపెట్టడం పెట్టుబడిదారుల్లో కొత్త సంతోషాన్ని నింపుతోంది. ఐపీవో సబ్ స్క్రిప్షన్ సమయంలో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు తొలిరోజే భారీగా లాభాలను అందుకోవటంతో వారు సంతోషంలో ఉన్నారు.
ఈ క్రమంలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 136.85 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీ 56.09 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 16.58 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చూసింది. దీంతో మార్కెట్ల నుంచి కంపెనీ ఐపీవోకు బలమైన స్పందన లభించిందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications