భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు మరింత ఊరట కలిగించే పన్ను సంస్కరణలను హామీ ఇచ్చారు.ప్రధాని మాట్లాడుతూ.. మేము ఇక్కడితో ఆగపోవడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్ను భారం తగ్గుతూనే ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో GST సంస్కరణలు కొనసాగుతాయని సెప్టెంబర్ 25, 2025న గ్రేటర్ నోయిడాలో జరిగిన UP అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో మోదీ ప్రకటించారు.
సెప్టెంబర్ 4న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని GST కౌన్సిల్ అనేక వస్తువులపై GST రేట్లను తగ్గించింది. పన్ను రేట్లను మునుపటి నాలుగు స్లాబ్‌ల నుండి (5%, 12%, 18%, 25%) కేవలం రెండు స్లాబ్‌లకు (5% మరియు 18%) సరళతరం చేసింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు ఆదాయపు పన్ను లేకుండా చేయడం మరో పెద్ద సంస్కరణగా నిలిచింది. ఈ చర్యలు సాధారణ ప్రజలకు పెద్ద ఊరట కలిగించడమే కాకుండా, వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిస్తాయని కేంద్రం నమ్ముతోంది.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ చర్యలతో ప్రజల చేతుల్లో మరింత డబ్బు మిగులుతుంది. GST సంస్కరణలు భారత వృద్ధి కథకు కొత్త రెక్కలు ఇస్తాయి. ప్రజలకు పొదుపు పెరిగితే ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అయితే, కేవలం పన్ను సంస్కరణలతోనే కాకుండా, దేశం స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా చెప్పారు. పరిశోధన మరియు అభివృద్ధి (R&D) పై పెట్టుబడులు పెంచాలనన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. భారతదేశంలో తయారు చేయగల ప్రతి ఉత్పత్తిని భారతదేశంలోనే తయారు చేయాలని పిలుపునిచ్చారు.
భౌగోళిక రాజకీయ సవాళ్లు, వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ భారత వృద్ధి ప్రయాణం బలంగా ఉందని మోదీ అన్నారు.అయితే తాజా అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా, భారత ఎగుమతులపై 50 శాతం సుంకం విధించింది. ఇది ఆటోమొబైల్స్ నుండి రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వరకు అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది.అమెరికా ప్రభుత్వం కొత్తగా $100,000 H-1B వీసా ఫీజు విధించింది. దీని వల్ల భారత IT సంస్థల వ్యాపార నమూనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, పన్ను సంస్కరణలు భారత ప్రజలకు తాత్కాలిక ఊరటను అందిస్తాయి. కానీ దీర్ఘకాలికంగా దేశం స్వావలంబన దిశగా పయనించాల్సిందే అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.


Click it and Unblock the Notifications