Rozgar Mela: వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన సుమారు 70 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను అధికారులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచమంతా భాగస్వాములయ్యేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దేశం రాజకీయ సుస్థిరతతో నిర్ణయాత్మక ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని మోదీ తెలిపారు. దేశ ప్రగతి, ఆర్థిక మరియు సామాజిక నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునే అవకాశం లభించినట్లు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ కాల్ ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్న ప్రధాని.. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారనుందన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారికి ఇది చాలా ముఖ్యమైన క్షణమని గుర్తుచేశారు.

ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలపై ప్రధాని మాట్లాడారు. ముద్రా పథకం, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలను వినియోగించుకుంటూ.. యువత ఉద్యోగాలు సృష్టిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. SSC, UPSC మరియు RRB వంటి సంస్థలు కూడా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తున్నాయన్నారు.
ఆర్థిక మాంద్యం, కొవిడ్ మహమ్మారి, కొనసాగుతున్న యుద్ధం కారణంగా సరఫరా గొలుసులో అంతరాయం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రధాని గుర్తు చేశారు. వాటన్నిటికీ అతీతంగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోందని అభినందించారు.
దేశంలో MNC కంపెనీల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. దేశ GDPలో 6.5 శాతానికి పైగా దోహదపడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఇందుకు ఉదాహరణగా చూపారు.


Click it and Unblock the Notifications