Semicon India 2024: ప్రపంచంలోని ప్రతి పరికరంలో మేడ్ ఇన్ ఇండియా చిప్ ఉండాలి: ప్రధాని మోదీ
PM Modi News: ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ కూటమి ఇండియాను గ్లోబల్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా మార్చాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చిప్ తయారీ రంగంపై భారత్ పట్టు బిగించటం గురించి వేగంగా ముందుకు సాగుతున్నారు.
యూపీలోని గ్రేటర్ నోయిడాలో నేడు జరిగిన ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్లోబల్ సెమీకండక్టర్ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'గ్లోబల్ సెమీకండక్టర్ ఇనిషియేటివ్‌ను ప్రపంచంలో ప్రారంభించిన 8వ దేశం ఇండియా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ కొరత ఏర్పడినప్పుడు, సెమీకండక్టర్ టెక్నాలజీని అందించడానికి ప్రపంచం భారతదేశంపై పందెం వేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో చిప్ తయారీ రంగంపై ఇన్వెస్టర్లు ముందుకు రావాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

అత్యంత ప్రాథమిక అవసరాలకు కూడా సెమీకండక్టర్లు త్వరలో అవసరమని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశ భవిష్యత్తుతో పాటు వ్యాపారం రూపొందించడంలో సాంకేతికత పాత్రపై కూడా ప్రధాని మోదీ చర్చించారు. మొబైల్ హ్యాండ్‌సెట్‌ల ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్-2గా ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అని మోదీ అన్నారు. సెమీకండక్టర్ల నుంచి పూర్తయిన వస్తువుల వరకు భారతదేశంలో 100% ఎలక్ట్రానిక్స్ తయారీని కలిగి ఉండటమే లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ సాంకేతిక అభివృద్ధికి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా ఏర్పాటు చేయాలనేది తన ఆకాంక్షగా ప్రధాని మోదీ చెప్పారు.
ఇప్పటికే చిప్ తయారీ రంగంలో దేశీయంగా రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, మరిన్ని పెట్టుబడులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. రానున్న కాలంలో ప్రపంచంలోని ప్రతి పరికరంలో భారతదేశంలో తయారు చేయబడిన చిప్ ఉండాలనేది తన కల అని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతమున్న 150 బిలియన్ డాలర్ల నుంచి దశాబ్దం చివరినాటికి ఎలక్ట్రానిక్స్ రంగం కోసం భారతదేశం 500 బిలియన్ డాలర్ల పరిమాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని తెలిపారు.


Click it and Unblock the Notifications