Modi on Black Money: బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని ప్రజలకు నేరుగా పంచేస్తానని గతంలో ప్రధాని మోదీ ప్రకటించటం చాలా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ పార్టీల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్న కీలక సమయంలో ప్రధాని మోదీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఓటర్లను తన మాటలతో బీజేపీ వైపు తిప్పుకునేందుకు తనవంత ప్రయత్నాలను మోదీ ఇటీవల ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రధాని మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలోని పేదలకు నల్లధనాన్ని ఎలా తిరిగి ఇవ్వాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సంపదను బాధితులకు పంపిణీ చేయడంపై దృష్టి సారించి, అవినీతిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంస్కరణలను అమలు చేయడానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు ప్రధాని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.25 లక్షల కోట్లలో రూ.17,000 కోట్లను తిరిగి ఇచ్చేసినట్లు ప్రధాని వెల్లడించారు.

అయితే స్వాధీనం చేసుకున్న మెుత్తంలో దాదాపు 80 శాతం రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సీజ్ చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.1.25 లక్షల కోట్ల కంటే 10 రెట్లు అధికంగా ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వికాస్ పహ్వా చెప్పారు. ఈ ఆస్తుల్లో ఎక్కువ శాతం 1970ల నుంచి 1990 మధ్య కాలంలో కొన్నవిగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఉదాహరణ చెప్పిన పహ్వా దిల్లీలోని పాష్ ఏరియాలో జప్తు చేసిన ఆస్తి విలువ పుస్తకం ప్రకారం రూ.10-20 లక్షలుగా ఉన్నప్పటికీ వాస్తవ మార్కెట్ వ్యాల్యూ రూ.30 కోట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కే పరిమితం కాకుండా అన్ని కేసుల్లో ఆస్తిని అటాచ్‌మెంట్ చేసే నిబంధనను కలిగి ఉన్న కొత్త చట్టాన్ని ఈ ఏడాది జూలైలో ఆశిస్తున్నట్లు పహ్వా చెప్పారు. అయితే విచారణ ముగిసే వరకు ఆస్తి బదిలీ 'ప్రమాదకర ప్రతిపాదన' అని పహ్వా అన్నారు. కొత్త చట్టం వచ్చినప్పుడు కొన్ని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును న్యాయస్థానంలో పరీక్షించవలసి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న కాలంలో కఠిన ఆంక్షలు నేరాలకు పాల్పడేవారికి పెద్ద సమస్యలను తెచ్చిపెట్టనున్నట్లు మోదీ ఇటీవలి ఇంటర్వ్యూ ప్రకారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications