Inflation: ద్రవ్యోల్బణంపై దేశప్రజలకు మాటిచ్చిన ప్రధాని మోదీ..! ఒక్కరోజు తర్వాత..
PM Modi: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోందని అన్నారు. ఈ క్రమంలో భారతదేశం వస్తువులను దిగుమతి చేసుకుంటే అది ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకుంటుందని చెప్పారు.
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనేక కారణాలతో అతలాకుతలం అయ్యాయి. ఆ ప్రభావం నుంచి అవి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేదు. యుద్ధం మరో సమస్యను సృష్టించింది. అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం ప్రజలను పట్టి పీడిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం అనేక ర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో కొంత మేర విజయం సాధించినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో మన ప్రజలపై ధరల పెరుగుదల భారాన్ని తగ్గించడానికి తాము మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. దీని కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని మాటిచ్చారు. తాజాగా జూలై మాసంలో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిన ఒక్కరోజు తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం వచ్చింది. ప్రధానంగా టమాటా, కూరగాయల ధరలు దీనికి కారణంగా నిలిచాయి. దీంతో ఆర్బీఐ నిర్థేశించిన 6 శాతం కంటే ఎక్కువకు రిటైల్ ద్రవ్యోల్బణం చేరుకుంది.
RBI రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధిలో ఉంచేందుకు లక్ష్యాన్ని కలిగి ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చాలా నెలల్లో గరిష్ట పరిమితి కంటే ఎక్కువగానే ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ వరకు ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ కంఫర్ట్ జోన్‌లో ఉంది.
గతవారం ద్రవ్యపరపతి సమావేశంలో మాట్లాడిన రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సమీప కాలంలో ప్రధాన ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రెండవ త్రైమాసిక ద్రవ్యోల్బణం అంచనాను 6.2 శాతానికి సవరించారు.


Click it and Unblock the Notifications