పీఎం మోదీ బంపర్ గిఫ్ట్: రేపే 15 లక్షల మంది అకౌంట్లలోకి రూ. 2,400 కోట్లు.. ఆ స్కీమ్ వివరాలు ఇవే!
దేశంలో నిరుద్యోగ నిర్మూలనకు, కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 19 (శుక్రవారం) నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఒక జాతీయ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' (PM-VBRY) కింద ఏకంగా రూ. 2,400 కోట్ల ఇన్సెంటివ్‌లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT ద్వారా) బదిలీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది.

15 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు!
ఆగస్టు 2025లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం.. అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల సరికొత్త ఉద్యోగాల సృష్టికి అండగా నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులను సంఘటిత రంగం (Formal Economy) వైపు మళ్లించేందుకు ఈ ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. ఇందులో అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీల యజమానులకు ఇద్దరికీ భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు.
కొత్తగా జాబ్స్ వచ్చే వాళ్లకు రూ. 15,000 బోనస్!
మొదటిసారి ఫార్మల్ సెక్టార్‌లో ఉద్యోగంలో చేరే యువతకు ఈ స్కీమ్ ఒక వరంగా మారింది. తొలిసారి ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ. 15,000 వరకు ఆర్థిక సహాయం పొందడానికి అర్హులు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. వారు ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత మొదటి ఇన్‌స్టాల్‌మెంట్, 12 నెలల సర్వీస్ పూర్తయిన తర్వాత రెండో ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో రెండు విడతలుగా నేరుగా వారి అకౌంట్లలో వేస్తారు.
కంపెనీలకూ కాసుల వర్షం!
కేవలం ఉద్యోగులకే కాకుండా.. కొత్తగా జాబ్స్ (Jobs) కల్పిస్తూ అదనపు సిబ్బందిని చేర్చుకునే కంపెనీల యజమానులకు (Employers) కూడా కేంద్రం బూస్టర్ ఇస్తోంది. ప్రతి అదనపు ఉద్యోగిపై నెలకు గరిష్టంగా రూ. 3,000 చొప్పున ఇన్సెంటివ్ అందిస్తుంది. దీనివల్ల కంపెనీలు మరిన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
ముఖ్యంగా దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన తయారీ రంగం (Manufacturing Sector) లో ఉద్యోగాల సృష్టి కోసం కేంద్రం మరింత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. మిగతా రంగాల వారికి ఈ ఇన్సెంటివ్స్ 2 ఏళ్ల పాటు ఇస్తే.. మాన్యుఫాక్చరింగ్ రంగానికి మాత్రం ఏకంగా 4 సంవత్సరాల పాటు పొడిగించారు. ఇది 'మేక్ ఇన్ ఇండియా' (Make in India) నినాదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.
2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం!
మొత్తం రూ. 99,446 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపులతో నడుస్తున్న ఈ పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా.. రెండేళ్ల కాలంలో దేశంలో ఏకంగా 3.5 కోట్లకు పైగా కొత్త జాబ్స్ (Jobs) సృష్టించాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. 1 ఆగస్టు 2025 నుండి 31 జూలై 2027 మధ్య కాలంలో వచ్చే ఉద్యోగాలన్నింటికీ ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా దాదాపు 1.92 కోట్ల మంది సరికొత్త యువ కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కాబోతున్నారని అంచనా!


Click it and Unblock the Notifications