Petrol & Diesel News: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై వరుసగా తొమ్మిదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగిస్తూ.. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యం నెరవేరిందని వెల్లడించారు. దీని వల్ల వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కూడా దోహదపడిందని వెల్లడించారు.

ముడిచమురు దిగుమతులపై..
పెట్రోలియం ఉత్పత్తుల కోసం మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడతామనేది రహస్యమేమీ కాదు. అందువల్ల నవంబర్ 2022 నాటికి పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపడం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యంగా పెట్టుకున్న షెడ్యూల్ సమయాని కంటే ఐదు నెలల ముందుగానే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని భారత్ సాధించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 2025-26 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్ నిష్పత్తిని రెట్టింపు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వ చమురు కంపెనీల ప్రయత్నాలు..
చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి సేకరించిన ఇథనాల్‌ను 10 శాతం వరకు పెట్రోల్‌లో కలపడం ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల బలమైన ప్రయత్నాల వల్ల సాధ్యమైందని తెలుస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లు ఇందుకోసం చాలా ప్రయత్నాలు చేశాయి.

విదేశీ మారకపు పొదుపు..
పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపడం ద్వారా దేశానికి రూ.41,500 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. ఇది మాత్రమే కాదు.. గ్రీన్ హౌస్ గ్యాస్ (GHG) ఉద్గారాలను 27 లక్షల టన్నుల మేర తగ్గించింది. దీంతో రైతులకు తక్షణమే రూ.40,600 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి. యూఎస్, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఇథనాల్ ఉత్పత్తిలో ఐదవ అతిపెద్ద మార్కెట్ గా ఆవిర్భవించింది.

భారత్, బ్రెజిల్‌లో..
ప్రస్తుతం ఇథనాల్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపయోగించబడుతోంది. బ్రెజిల్, ఇండియా వంటి దేశాలు సైతం ప్రస్తుతం దీనిని పెట్రోలులో కలుపుతున్నాయి. ఇంధన భద్రతను పెంపొందించడానికి, చమురు కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు, దేశీయ వ్యవసాయ రంగాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ద్వారా రానున్న కాలంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications