PM Modi: ఈసారి ఎన్నికల్లో మోదీ కొత్త అస్త్రం.. అప్పుడు బ్లాక్ మనీ వెనక్కి, ఇప్పుడేమో..
PM Elections Promise: గత ఎన్నికల వేళ విదేశాల్లోని బ్లాక్ మనీని వెనక్కు తెప్పిస్తానంటూ హామీ ఇచ్చి ప్రధాని మోదీ సారథ్యంలోని భాజపా అధికారం చేపట్టింది. కాగా ఇప్పుడు కూడా ఇదే తరహా ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నట్లుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని పార్టీ నేతలతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన చర్చపై ఇప్పుడు వివాదం నెలకొంది.
వివిధ కేసుల్లో అవినీతిపరుల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటానని మోదీ వెల్లడించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇందుకుగాను అందుబాటులో ఉన్న చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారని సమాచారం.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ అభ్యర్థి అమృతా రాయ్‌తో ప్రధాని సంభాషణను BJP బయటపెట్టింది. ED కేసుల్లోని నగదుకు సంబంధించి బెంగాల్ ప్రజల కోసం తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండంటూ మోదీ కోరినట్లు వెల్లడించింది. ED అటాచ్ చేసిన పేదలకు చెందిన దాదాపు 3 వేల కోట్ల గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
బెంగాల్‌లో అనేక కుంభకోణాల కేసులను ED విచారిస్తోంది. పాఠశాల నియామకాలు, రేషన్, బొగ్గు, పశు సంపద విషయంలో వచ్చిన ఆరోపణలపై అధికార TMCకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి. మమతా బెనర్జీ పార్టీకి చెందిన మాజీ మంత్రి పార్థ ఘోష్ సన్నిహితుడి నుంచి కేంద్ర ఏజెన్సీ 2022లో నగదు ట్రక్కులను కూడా స్వాధీనం చేసుకుంది. దీన్ని ఉద్దేశించే ఇప్పుడు మోదీ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. ప్రధాని ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించి నగదు ప్రయోజనాలతో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. కొత్త పథకాలు, చట్టాలు, నగదు వాగ్ధానాలు ప్రకటించకుండా BJP నాయకులను నిరోధించాలని పోల్ ప్యానెల్‌ను కోరింది.


Click it and Unblock the Notifications