NTPC Green Hydrogen: కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో వరుసగా పెట్టుబడుల కోలాహలం కొనసాగుతోంది. కేంద్రం నుంచి అండ లభించటంతో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల ఏర్పాటుకు సర్వం సిద్ధం అవుతోంది. ఏపీ ప్రజలకు ప్రభుత్వం అందించిన తాజా శుభవార్తతో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ రూ.85 వేలకోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ఏపీని అనువైన ప్రాంతంగా ఎంచుకుంది. దీంతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ప్రాజెక్టు ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. దీని శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 29న ప్రధాని మోదీ కూడా రాష్ట్రానికి రావటం గమనార్హం. ప్రాజెక్ట్ పూర్తయితే ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలవనుంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 1200 ఎకరాల భూ కేటాయింపు చేసింది. ఇందులో సగం ప్రాంతాన్ని కంపెనీ రోజుకు 1100 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం వినియోగించాలని నిర్ణయించింది. 20 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ఇది ఏర్పాటు కానుందని తెలుస్తోంది.

కాగా మరో 300 ఎకరాల్లో కంపెనీ ఎలక్ట్రోలైజర్లు, సోలార్ పీవీ, బ్యాటరీ స్టోరేజీల ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇక చివరిగా మిగిలిన 300 ఎకరాలను ఈ మెగాప్రాజెక్టుకు అవసరమైన వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి ఉపయోగించాలని చూస్తోంది. కాగా మెుదటి దశ పనులు పూర్తి కావటానికి దాదాపు 3 ఏళ్ల సమయం పట్టనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రధాని మోదీ ఏపీకి రావటంతో నేషనల్ మీడియా సైతం ఆసక్తిగా ఇప్పుడు విశాఖవైపు చూస్తోంది. ప్రాజెక్టు దాదాపు 48 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలుస్తోంది. ఇందులో ప్రత్యక్షంగా మరియూ పరోక్షంగా ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
మచిలీపట్నం తీరంలో బీపీసీఎల్..
ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ తయారీకి ముందడుగులు పడుతుండగా మరోపక్క కూటమి ప్రభుత్వం బందరు దగ్గర బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయించేందుకు భారీగా కృషి చేస్తోంది. రిఫైనరీ ప్రాజెక్టును సాధించేందుకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. బీపీసీఎల్ దాదాపు రూ.50వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనుందని తెలుస్తోంది. సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును దక్కించుకోవటం కోసం గుజరాత్, యూపీ సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే తీరప్రాంతం ఉన్న మచిలీపట్నం ప్లాంట్ ఏర్పాటుకు అనువైనదిగా అధికారులు బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులకు వెళ్లడిస్తూ రెండు చోట్ల స్థలం కేటాయించటానికి సుముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబు టీం సైతం దీనికోసం ప్రత్యేకంగా కృషిచేస్తోందని తెలుస్తోంది. ఈ రిఫైనరీ ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు భారీగా రాష్ట్రానికి ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications