మూడు దేశాలు.. నాలుగు రోజులు.. ప్రధాని మోదీ కీలక విదేశీ మిషన్, పర్యటన పూర్తి వివరాలు ఇవిగో..
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారం రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 15 నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు
ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటనతో Modi నాలుగు రోజుల పర్యటన ప్రారంభిస్తారు. జోర్డాన్ రాజు *అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ డిసెంబర్ 15 నుంచి 16 వరకు జోర్డాన్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన రాజు అబ్దుల్లా IIతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో భారత్-జోర్డాన్ సంబంధాల మొత్తం పరిధిపై సమీక్ష జరగనుండగా, మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పరస్పర వృద్ధి, ఆర్థిక సహకారం, వ్యాపార సంబంధాల విస్తరణతో పాటు ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో భారత్ నిబద్ధతను ఇది మరోసారి స్పష్టం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. జోర్డాన్ పర్యటనలో ఇండియా-జోర్డాన్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అలాగే చారిత్రక నగరం పెట్రాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
ఈ పర్యటన రెండో దశలో ప్రధాని మోదీ డిసెంబర్ 16న ఇథియోపియాకు చేరుకుంటారు. అక్కడ రెండు రోజుల పాటు బస చేయనున్నారు. ఆయనకు ఇది మొదటి ఇథియోపియా పర్యటనకావడం విశేషం. ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ఆయన విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. గ్లోబల్ సౌత్‌లో కీలక భాగస్వాములుగా భారత్-ఇథియోపియా దేశాలు కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో, ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహబంధాలను మరింత బలపరచే కీలక మైలురాయిగా మారనుంది. వాణిజ్యం, అభివృద్ధి సహకారం, సామర్థ్య నిర్మాణం వంటి అంశాలు చర్చల కేంద్రబిందువుగా ఉండనున్నట్లు MEA వెల్లడించింది.
తన పర్యటన చివరి దశలో ప్రధాని మోదీ డిసెంబర్ 17 నుంచి 18 వరకు ఒమన్ సుల్తానేట్‌ను సందర్శిస్తారు. ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన ప్రధాని మోదీకి ఒమన్‌లో రెండో పర్యటన కావడం గమనార్హం. భారత్-ఒమన్ మధ్య విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. శతాబ్దాల నాటి వాణిజ్య సంబంధాలు, బలమైన ప్రజల మధ్య బంధాలు ఈ సంబంధాలకు పునాది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రత, సాంకేతికత, వ్యవసాయం, సంస్కృతి వంటి విభాగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమగ్రంగా సమీక్షించనున్నారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరగనుంది. ఒమన్‌లో భారత రాయబారి షేక్ హుమైద్ బిన్ అలీ బిన్ సుల్తాన్ అల్-మాని మాట్లాడుతూ, ప్రధాని మోదీ మస్కట్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలక మైలురాయి అవుతుందని తెలిపారు.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజుల పర్యటన భారత్ యొక్క ఆర్థిక దౌత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, గ్లోబల్ సౌత్‌లో నాయకత్వ పాత్రను మరింత బలపరచే దిశగా కీలక అడుగుగా నిలవనుంది.


Click it and Unblock the Notifications