వ్యాపారం ప్రభుత్వం పని కాదని, ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత కాలానికి తగినట్లు సంస్కరణలు అనివార్యమన్నారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (DIPAM) నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడారు. వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ ప్రభుత్వం దృష్టి అయినా ప్రజా సంక్షేమం పైన ఉండాలన్నారు. ఈ సందర్భంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ సంస్కరణలను వివరించారు.

పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఖర్చు
ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరించడం తప్పనిసరని మోడీ అన్నారు. మోనిటైజ్ అండ్ మోడర్నైజ్ అనే సూత్రంతో కేంద్రం పని చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం మోనిటైజ్ అంటే నగదు రూపంలోకి మార్చడం చేస్తే ఆ స్థానంలోకి ప్రయివేటురంగం వస్తుందన్నారు. ప్రయివేటు రంగంతో పెట్టుబడులు వస్తాయని, అత్యుత్తమస్థాయి అంతర్జాతీయ విధానాలు అమల్లోకి వస్తాయన్నారు. అనేక ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని, వీటి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చుపెట్టవలసి వస్తోందన్నారు. కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కోసం ప్రభుత్వరంగ సంస్థలు నడపకూడదన్నారు.

ప్రయివేటుతో సమర్థత.. రూ.2.5 లక్షల కోట్ల సమీకరణ
నష్టాల్లోని ప్రభుత్వరంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని మోడీ అన్నారు. ప్రయివేటు రంగం వల్ల సమర్థత పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు కొత్తగా వస్తాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటైజేషన్ చేయడం వల్ల వచ్చిన మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామన్నారు. అనేక ప్రభుత్వ ఆస్తులు వాటి సామర్థ్యానికి తగినట్లు పని చేయడం లేదని, వీటిని మానిటైజ్ చేయడం ద్వారా రూ.2.5 లక్షల కోట్లు సమీకరిస్తామన్నారు.

మార్పు అవసరం
నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే అది నష్టాలకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వం నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటుందని, సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండదన్నారు.
ప్రయివేటీకరణతో వచ్చే డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం, సురక్షిత తాగునీటి సరఫరా, చౌక ఇళ్ల నిర్మాణం తదితరాలకు ఉపయోగిస్తామన్నారు. వ్యాపారాలను ప్రోత్సహించడం తప్ప వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదన్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వరంగ స్థాపించిన నాటి పరిస్థితులు వేరని, ఇప్పుడు వేరు అన్నారు. కాలానుగుణంగా సంస్కరణలు అవసరమన్నారు.

డబ్బు వృధా
పన్ను చెల్లింపుదారుల డబ్బు ప్రభుత్వరంగ సంస్థల నష్టాలకు వినియోగించడం ద్వారా వృథా అవుతోందన్నారు. పేదలు హక్కుదారులుగా ఉన్న ఈ డబ్బును PSUల కోసం వెచ్చించాల్సి వస్తోందన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై అధిక భారం పడుతోందన్నారు. కేవలం అణు ఇంధనం-అంతరిక్షం, రవాణా-టెలీకమ్యూనికేషన్స్, విద్యుత్-పెట్రోలియం-బొగ్గు-ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్-బీమా-ఆర్థిక సేవల్లో మాత్రమే ప్రభుత్వ వాటా సాధ్యమైనంత కనిష్టస్థాయిలో ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications