న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి-లాక్‌డౌన్ నేపథ్యంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారీ ప్యాకేజీని ప్రకటించారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇది దేశ జీడీపీలో 10 శాతం. కరోనా నేపథ్యంలో ఆయన దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ సమయంలో పేదలు, కార్మికుల కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్యాకేజీ ఉంటుందని చెప్పారు, మధ్యతరగతి, కర్షకులు, పేదలు, కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలు.. ఇలా అందరినీ ఆదుకునేందుకు ప్రకటించినట్లు చెప్పారు.

భారీ ప్యాకేజీ కోరిన నిపుణులు
ప్రతి ఒక్కరు స్థానిక వస్తువులను ప్రచారం చేయాలని మోడీ సూచించారు. స్థానికంగా ఉన్నవే ఈ లాక్ డౌన్ కష్టకాలంలో ఆదుకున్నాయని చెప్పారు. ఈ ప్యాకేజీతో అన్ని రంగాలు బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధికి ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాగా, వివిధ రంగాలు భారీ ఎత్తున ప్యాకేజీ ప్రకటిస్తేగానీ ఆర్థిక వ్యవస్థ కోలుకోదని ఆకాంక్షించాయి.

ఓ విధంగా ఊహించని ప్యాకేజీ
వివిధ రంగాలు రూ.5 లక్షల కోట్ల నుండి రూ.15 లక్షల కోట్ల వరకు ప్యాకేజీని అడిగాయి. రూ.20 లక్షల కోట్లు ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటుందని సూచించిన నిపుణులు, పారిశ్రామిక రంగ సంఘాలు ఉన్నాయి. కేంద్రం రూ.10 లక్షల కోట్ల వరకు ప్యాకేజీ ప్రకటించవచ్చునని భావించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. జీడీపీలో 10 శాతం ప్యాకేజీ ప్రకటించాలని పలువురు ఆర్థిక నిపుణులు సూచించారు.

లాక్ డౌన్ కొనసాగింపు
ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రపంచమంతా సంక్షోభంలో ఉందని, మనమంతా నిబ్బరంగా ఉండాలని సూచించారు. ఆత్మనిబ్బర భారత్ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో చూడలేదన్నారు. ప్రతి ఒక్కరు స్థానిక వస్తువుల కోసం ప్రచారం చేయాలని, అప్పుడే గ్లోబల్ స్థాయికి చేరుకుంటామన్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుండి లాక్ డౌన్-4 ఉంటుందన్నారు. దీనిని మరింత బలంగా ఎదుర్కొందామని సూచించారు.


Click it and Unblock the Notifications