PM Modi: యువతకు మోదీ శుభవార్త.. యువతకు 90 వేల ఉద్యోగ అవకాశాలు, స్కీమ్ స్టార్ట్..
PM Internship Scheme: భారీ జనాభాతో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగిత. ప్రతి ఏటా కాలేజీల నుంచి లక్షల మంది గ్రాడ్యూయేట్లు జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతుండగా ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగటం లేదని రాజకీయ దుమారం కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పీఎం ఇంటర్న్‌షిప్ పోర్టల్ గురించే. అవును దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ 12 సాయంత్రం భారతీయ అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ల కోసం అభ్యర్థుల రిజిస్ట్రేషన్ స్వీకరణను స్కీమ్ ప్రారంభించనుంది. అక్టోబర్ 3న కంపెనీల కోసం ప్రారంభించబడిన పోర్టల్లో ఇప్పటికే దేశంలోని దాదాపు 193 కంపెనీలు తమ వద్ద అందుబాటులో ఉన్న 90 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేశాయి. ప్రభుత్వ వర్గాలు అందించిన వివరాల ప్రకారం అక్టోబర్ 11 నాటికి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ పోర్టల్‌లో పోస్ట్ చేయబడిన అవకాశాల సంఖ్య 90,849గా ఉన్నట్లు వెల్లడైంది.

ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద అవకాశాలను కల్పిస్తున్న వాటిలో దేశంలోని అగ్రగామి వ్యాపార సంస్థలు సైతం ఉన్నాయి. ఈ జాబితాలో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, మారుతీ సుజుకి ఇండియా, ఐషర్ మోటార్స్, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు భారీగా అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశంలోని దాదాపు 24 రంగాలకు చెందిన కంపెనీలు అవకాశాలను కల్పిస్తుండగా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల్లో అత్యధికంగా అవకాశాలు ఉండగా.. తర్వాతి స్థానాల్లో ట్రావెల్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అవకాశాలను పోస్ట్ చేశాయి. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ అవకాశాలు దేశంలోని 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 737 జిల్లాల విస్తరించి ఉన్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఉపాధి, నైపుణ్యం ప్యాకేజీలో భాగంగా దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీలకు ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రకటించారు. కానున్న 5 ఏళ్లలో దాదాపు కోటి మంది యువతకు ఈ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడం లక్ష్యంగా ప్రస్తుత పథకం రూపొందించబడింది. ప్రస్తుతం ప్రభుత్వం 1.25 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాల లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టును నేడు సాయంత్రం ప్రారంభిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.800 కోట్లు కేటాయించినట్లు వెల్లడైంది. దీని నుంచి నేర్చుకున్న అంశాల ఆధారంగా భవిష్యత్తులో పూర్తి స్థాయి ఇంటర్న్‌షిప్ పథకాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దరఖాస్తుదారుల కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ https://pminternship.mca.gov.in/login/ పోర్టల్ అభివృద్ధి చేసింది.


Click it and Unblock the Notifications