PhonePe: కాంగ్రెస్‌పై ఫోన్‌పే ఆగ్రహం.. లీగల్ యాక్షన్‌కు వెళ్తామంటూ ట్వీట్.. అసలేం జరుగుతోంది..?
PhonePe: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, BJP నేతల రాజకీయం వేడెక్కింది. BJP నేత, రాష్ట్ర CM శివరాజ్‌సింగ్ చౌహాన్ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలకు దిగింది. అయితే ఈ రాజకీయాల్లోకి ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్ పే'ను లాగడం.. ఆ కంపెనీకి కోపం తెప్పించింది. దీంతో లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే రీతిలో సున్నితంగా హెచ్చరించింది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఏదైనా పనిచేయడానికి డబ్బు తీసుకుంటూ, అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తోంది. ఇందులో భాగంగా CM నుంచి పని జరగాలంటే 50 శాతం కమిషన్ ఇచ్చి చేయించుకోవాలంటూ.. ముఖ్యమంత్రి ఫొటోతో కూడిన 'ఫోన్ పే' లోగోను గుర్తు తెలియని వ్యక్తులు భోపాల్ అంతటా పోస్టర్లు వేశారు.

ఈ వివాదంలో తమ రిజిస్టర్డ్ బ్రాండ్ లోగోను వినియోగించడంపై ఫోన్ పే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించింది. "మా బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడాన్ని ఫోన్ పే వ్యతిరేకిస్తుంది. మేము ఏ రాజకీయ ప్రచారం లేదా పార్టీతో సంబంధం కలిగి లేము. రాజకీయ లేదా రాజకీయేతర పక్షాలు మా లోగో వినియోగించడం సరికాదు" అని ట్వీట్ చేసింది.
తాజాగా వెలిసిన పోస్టర్ల పైన 'PhonePe' అని రాసి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కంపెనీ మరోసారి స్పందించింది. "PhonePe లోగో మా కంపెనీ నమోదిత ట్రేడ్‌మార్క్. మా మేధో సంపత్తి హక్కును అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరంగా ముందుకు వెళ్తాం. మా బ్రాండ్ లోగో, రంగు ఉన్న పోస్టర్‌లు మరియు బ్యానర్‌లు తీసివేయాలని @INCMPని సవినయంగా అభ్యర్థిస్తున్నాము" అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసింది.
పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులపై గ్వాలియర్‌లోని పడవ్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయబడింది. తమ పార్టీ పరువు తీస్తున్నారని ఓ BJP కార్యకర్త ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గ్వాలియర్ SP రాజేష్ సింగ్ చందేల్ మీడియాకి తెలిపారు. ఫోన్‌పే ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications