PhonePe: ZestMoney కొనుగోలు ప్రణాళికను రద్దుచేసకున్న PhonePe.. కారణమేమిటంటే..?
PhonePe: డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు దేశంలో ఎక్కువ మంది ఫోన్ పేను వినియోగిస్తుంటారు. మార్కెట్ షేర్ పరంగానూ ఇతర సంస్థలు కనీసం దరిదాపుల్లోనూ లేకుండా ఉన్నత స్థాయికి ఎదిగింది. వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ, మరిన్ని సేవలను కస్టమర్లకు అందించడానికి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ZestMoney ని సైతం కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
బై-నౌ-పే-లేటర్ (BNPL) ప్లాట్ ఫారం 'జెస్ట్ మనీ'ని కొనుగోలు చేసే ప్రణాళికను ఫిన్ టెక్ దిగ్గజం 'ఫోన్ పే' రద్దు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దాని ప్రకారం.. ఈమేరకు కంపెనీ బోర్డు సభ్యులు, పెట్టుబడిదారులకు ఫోన్ పే సమాచారం అందించింది. నెలల తరబడి పరిశీలన తర్వాత ఈ డీల్ పై ముందుకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు వెల్లడించింది.

వ్యాపారంపై తగిన శ్రద్ధ లేకపోవడం, వాల్యుయేషన్ పై భిన్నాభిప్రాయాలు, బిజినెస్ సుస్థిరతతో పాటు జెస్ట్ మనీ షేర్ హోల్డింగ్ నిర్మాణమూ.. ఈ డీల్ రద్దు కావడానికి ప్రధాన కారణాలని వార్తా సంస్థ వెల్లడించింది. జెస్ట్ మనీని ఆపరేట్ చేస్తున్న దాని మాతృ సంస్థ ప్రింరోస్ హిల్ వెంచర్స్ పాత్ర కూడా ఉన్నట్లు భావిస్తోంది. వీటికి తోడు ఈ కొనుగోలు ద్వారా 200-300 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ను ZestMoney ఆశించడం.. ఒప్పందం ఖరారు కాకపోవడానికి మరొక కారణం కావచ్చని తెలిపింది.
2015లో లిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ చే స్థాపించబడిన బెంగుళూరుకు చెందిన జెస్ట్ మనీ.. BNPL సేవలను అందిస్తోంది. వినియోగదారులు తమ షాపింగ్ బిల్లులను 3 వాయిదాలలో 0 శాతం వడ్డీ రేటుతో చెల్లించడానికి అనుమతిస్తోంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న BNPL కాంపిటీటర్స్ Simpl, LazyPay, ePayLater వంటి సంస్థలతో పోటీపడుతుంది.
ఊహించిన మేరకు పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించడంలో విఫలం కావడంతో.. కొనుగోలుదారు కోసం జెస్ట్ మనీ ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో తన రుణ సేవలను బలోపేతం చేసే ప్రణాళికలో భాగంగా జెస్ట్ మనీని చేజిక్కించుకోవడానికి ఫోన్ పే చర్చలు ప్రారంభించింది. ఈ డీల్ ను త్వరగా ముగించనున్నట్లు తొలుత భావించారు. కాగా ఈ కొనగోలు కనుక పూర్తయితే ఫిన్ టెక్ రుణ విభాగంలో అతిపెద్ద కన్సాలిడేషన్ డీల్‌గా ఇది మారేది.


Click it and Unblock the Notifications