ఫోన్ పే లో కొత్త సదుపాయం.. అలా చేసిన మొదటి భారతీయ ఫిన్ టెక్ గా రికార్డ్
UPI పేమెంట్స్ అనగానే గుర్తొచ్చే పేరు ఫోన్ పే(Phonepe). నగదు రహిత లావాదేవీల్లో భారతీయులు అత్యధికంగా విశ్వసించే యాప్ ఇది. ఒక్క నగదు బదిలీనే కాకుండా బిల్ పేమెంట్స్, ఇన్వెస్ట్ మెంట్, టికెట్ బుకింగ్, షాపింగ్ వంటి పలు రకాల ఇతర సేవలనూ అందిస్తోంది. ఇప్పటి వరకూ భారత్ లో మాత్రమే UPI సేవలు అందిస్తుండగా.. ఇకపై విదేశాల్లోనూ చెల్లింపులకు అనుమతిస్తోంంది.

అంతర్జాతీయ ప్రయాణాల్లో దన్నుగా..
భారతీయ ప్రయాణికులు విదేశాల్లో చెల్లింపులు చేయడానికి ఫోన్ పేలో అందుబాటులో ఉన్న 'UPI ఇంటర్నేషనల్'ని వినియోగించుకోవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సదుపాయం.. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ఫోన్ పే వినియోగదారులకు చాలా ఉపయోగకరమని భావిస్తున్నారు. దీని ద్వారా ఆయా దేశాల కరెన్సీలో UPI ద్వారా విదేశీ వ్యాపారులకు చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది.

ఆ రికార్డు సొంతం:
విదేశాల్లో చెల్లింపులను ప్రారంభించిన మొదటి భారతీయ ఫిన్‌టెక్ కంపెనీగా ఫోన్ పే రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ కార్డ్ ల మాదిరిగానే ఉండటం వల్ల భవిష్యత్తులో వాటి అవసరాన్ని తొలగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆండ్రాయిడ్, iOS ఆధారిత పరికరాల ద్వారా యాప్ ను యాక్సెస్ చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుబంధ సంస్థ నేషనల్ పేమెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (NPIL) సహకారంతో ఫోన్ పే ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేసింది.

ఇదీ పనితీరు:
ఈ విధానంలో.. భారతీయ బ్యాంకులు వినియోగదారుని బ్యాంక్ ఖాతా నుంచి మొదట నగదును డెబిట్ చేస్తాయి. ఆ మొత్తాన్ని ఆయా దేశాల స్థానిక కరెన్సీలోకి మార్చి చెల్లింపులు చేస్తాయి. ప్రత్యేకంగా ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా.. యాప్‌లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని యాక్టివేట్ చేసి UPI పిన్ ఎంటర్ చేస్తే చాలు. ప్రస్తుతానికి నేపాల్, భూటాన్, సింగపూర్, మారిషస్, UAEలోని స్థానిక వ్యాపారుల వద్ద ఈ ఆన్‌లైన్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని దేశాలు ఈ జాబితాలోకి చేరనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications