Paytm News: పార్టీ మారుతున్న పేటీఎం కస్టమర్స్.. తగిన ఏర్పాట్లలో ప్రత్యర్థి ప్లేయర్
PhonePe News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల కారణంగా దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది కాస్తా ప్రత్యర్థి ప్లేయర్స్‌కు వరంగా మారిందని చెప్పవచ్చు. కొన్ని వ్యాపార సంఘాలు కూడా పేటీఎంను వీడి మరో ఆప్షన్ చూసుకోవాలని చెప్పడంతో ఇతర సంస్థల్లోకి కస్టమర్ల ఇన్‌ఫ్లో పెరిగినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం పేటీఎంలో కొనసాగుతున్న సంక్షోభం సహా పేమెంట్ బ్యాంక్ UPI ఖాతాల విషయంలో వినియోగదారులు భయాందోళనలో ఉన్నారు. ఇదే సమయంలో వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే కస్టమర్స్ బేస్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా వినియోగదారుల సంఖ్య కనీసం 15 నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు నిలిపివేయడానికి ఫిబ్రవరి 29ని ఆర్బీఐ చివరి తేదీగా నిర్ణయించింది. గడువు సమీపిస్తున్నకొద్దీ ఫోన్ పే యాప్ ఇన్‌స్టలేషన్స్ మరియు లావాదేవీల్లో మరింత వృద్ధి కనిపించే అవకాశం ఉంది' అని ఫిన్ టెక్ రంగానికి చెందిన పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదనపు ఇన్‌ప్లో నిర్వహణ కోసం ఫోన్‌పే కూడా ఇప్పటికే బ్యాకెండ్ సిస్టమ్‌లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు సమాచారం.
అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని కస్టమర్ బేస్‌ను భారీగా పెంచుకోవాలని ఫోన్‌పే సైతం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివిధ రకాల ప్రచారాలతో వినియోగదారులు, వ్యాపారులను ఆకర్షించి ఆన్‌బోర్డ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్-డిసెంబర్ మధ్య UPI లావాదేవీల్లో ఫోన్ పే 46 శాతం వాటాను కలిగి అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు పేటీఎం వినియోగదారులు ఫోన్ పేకి మారడం వలన ఈ మార్కెట్ వాటా మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications