Pincode: 'పిన్ కోడ్' యాప్ రిలీజ్ చేసిన ఫోన్ పే CEO.. 6 విభాగాలతో ఇ-కామర్స్ రంగంలోకి అడుగులు
Pincode: నగదు రహిత, UPI లావాదేవీల్లో ఫోన్ పే అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ప్రత్యర్థులను వెనక్కినెట్టి దినదినాభివృద్ధి చెందుతోంది. దిగ్గజ సంస్థలు వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ దన్నుతో చెలరేగిపోతోంది. ఇదే ఉత్సాహంతో ఫిన్ టెక్ నుంచి ఇ-కామర్స్ రంగం దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం పిన్ కోడ్ పేరిట ప్రత్యేక యాప్ సైతం అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ఇప్పటికే స్విచ్ ద్వారా కొన్ని రకాల సేవలను అందిస్తున్న ఫోన్ పే.. ఇ-కామర్స్ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేయడానికి కొత్త యాప్ పిన్ కోడ్ ను ప్రారంభించింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) వేదికగా ఈ యాప్ పనిచేయనున్నట్లు ప్రకటించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ రెండింటి నుంచి దీనిని డౌన్ లోడ్ చేసువచ్చని తెలిపింది. పిన్ కోడ్ ద్వారా హైపర్ లోకల్ కామర్స్ పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

కిరాణా సరుకులు, ఆహారం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ, ఫ్యాషన్ సహా 6 ప్రధాన విభాగాల్లో ప్రముఖంగా పిన్ కోడ్ సేవలందిస్తుందని ఫోన్‌పే సహ వ్యవస్థాపకులు మరియు CEO సమీర్ నిగమ్ తెలిపారు. మొదటగా బెంగళూరులో ప్రారంభించి ఇతర నగరాలకూ విస్తరించనున్నట్లు చెప్పారు. అయితే మొదటి ఏడాదిలో తమ సేవలను 10 నగరాలకు మాత్రమే పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.
పిన్ కోడ్ లో కస్టమర్లు విభాగాల వారీగా నచ్చిన వాటి కోసం శోధించే అవకాశం కల్పించారు. ఒక్కో స్టోర్ కు ఓ యాక్టివ్ కార్ట్ అందుబాటులో ఉంటుంది. తద్వారా ఒకేసారి వివిధ కార్టుల్లో ఇష్టపడిన వస్తువులను యాడ్ చేసుకునే సదుపాయం దీని ప్రత్యేకత. డిసెంబరు నాటికి యాప్ లో రోజుకు లక్ష ఆర్డర్లు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ CEO తెలిపారు. ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్ మెంట్, లెండింగ్ సహా డేటా సెంటర్ల అభివృద్ధి వంటి కొత్త వ్యాపారాల్లోనూ కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది.


Click it and Unblock the Notifications