PFRDA News: జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కోసం పొదుపు చేసేందుకు ఉత్తమమైన మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు రెగ్యులేటరీ తాజాగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అకౌంట్స్ సెక్యూరిటీని PFRDA మెరుగుపరిచింది. సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ(CRA) సిస్టమ్‌కి లాగిన్ కావడానికి రెండంచెల భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఓ సర్క్యులర్ రిలీజ్ చేసింది. CRA లాగిన్ చేయడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా అదనపు భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొంది.

ఈ కొత్త లాగిన్ ప్రక్రియ ఏప్రిల్ 1, 2024 నుంచి అమలు చేయబడుతుందని PFRDA తెలిపింది. సర్క్యులర్ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల క్రింద ఉన్న నోడల్ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు NPS లావాదేవీల కోసం CRAని యాక్సెస్ చేసేందుకు పాస్‌వర్డ్ లాగిన్‌ను ఉపయోగిస్తున్నాయి. సెక్యూరిటీ కారణాల రీత్యా NPS పర్యావరణ వ్యవస్థకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ చర్య ఉద్దేశింపబడింది.
PFRDA అన్ని CRAలు,ప్రభుత్వ నోడల్ కార్యాలయాలకు వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP)ను అందజేయనుంది. తాజా మార్పుల గురించి అవగాహన కల్పించడానికి నోడల్ అధికారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అనధికార లాగిన్‌ను నిరోధించడానికి వినియోగదారుడు 5 సార్లు తప్పు పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే ఖాతా లాక్ చేయబడుతుందని వెల్లడించింది. రహస్య ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా పాస్‌వర్డ్ రీసెట్ చేసే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఈ సమయంలో ఫెయిల్ అయితే మళ్లీ ఐ-పిన్ కోసం రిక్వెస్ట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications