న్యూఢిల్లీ: కిందటి నెలలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు మొదటికే మోసం తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనికి ప్రత్యేక కారణం- ధరల పెరుగుదలేనని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. బండి బయటికి తీయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. రెండు వారాల వ్యవధిలో లీటర్‌పై 10 రూపాయల మేర అదనపు భారం పడింది.

ప్రయాణాలను మానుకుంటున్నారు..
దీని దెబ్బకు వాహనదారులు తమ ప్రయాణాలను మానుకోవడమో లేక.. ప్రజా రవాణా మీద ఆధారపడటమో చేశారు. ఫలితంగా- పెట్రోల్ అమ్మకాల్లో భారీ క్షీణత కనిపించింది. కిందటి నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతంగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. సగటున లీటర్‌పై 80 పైసల మేర పెంచాయి చమురు కంపెనీలు. అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది.

భారీ ధరలతో..
ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తన పంథానూ మార్చుకోలేదు. 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ దరలు నిలకడగా ఉన్నందున ఈ రెండు రోజులూ ఇంధన రేట్లను సవరించలేదు చమురు కంపెనీలు. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.105.41 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలు పలుకుతోంది.

ఎల్పీజీ, సీఎన్జీపైనా బాదుడేనా
ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ120.51 పైసలు, డీజిల్ రూ.104.77 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.115.12 పైసలు, డీజిల్ రూ.99.83 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.110.85 పైసలు, డీజిల్ 100.94 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.111.09 పైసలు, డీజిల్ రూ.94.79 పైసలుగా ఉంటోంది. గుర్‌గావ్‌లో పెట్రోల్ రూ.105.86 పైసలు, డీజిల్ 97.10 పైసలు. అదే సమయంలో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ రేట్లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. గృహావసర వినియోగదారులను సైతం వదల్లేదు. కమర్షియల్ సిలిండర్లపైనా భారం మోపింది.

10 శాతం మేర తగ్గుదల..
ఈ పెరుగుదల ప్రభావం పెట్రోల్ అమ్మకాల మీద తీవ్రంగా పడింది. మార్చితో పోల్చకుంటే ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు చోటు చేసుకున్న అమ్మకాల్లో 10 శాతం మేర క్షీణత కనిపించింది. డీజిల్‌లో ఈ సంఖ్య మరింత పెరిగింది. డీజిల్ అమ్మకాలు 15.6 శాతం మేర తగ్గాయి. ఎల్పీజీ గృహావసర వంటగ్యాస్ వినియోగం కూడా తగ్గింది. 1.7 శాతం మేర సిలిండర్ల బుకింగ్‌లో తగ్గుదల కనిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో వంటగ్యాస్ వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

పర్యాటకంపై దుష్ప్రభావం..
కాగా- పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో నెలకొన్న తగ్గుదల ఒకరకంగా దుష్ప్రభావాన్ని చూపుతున్నట్టే. వాటి అమ్మకాల మీద ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గినట్టే. ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. వ్యక్తిగత వాహనాల మీద పర్యాటక కేంద్రాలకు వెళ్లే వారిపైనా ఇది ప్రభావం చూపింది. ఫలితంగా- పర్యాటక రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.


Click it and Unblock the Notifications