Elections effect on Petrol: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెట్రోల్ ధరల విషయంలో కొంత వెనక్కు తగ్గడం సాధారణమే. ఎందుకంటే ప్రజలు వినియోగించే ప్రతి ఉత్పత్తిపైనా ఈ ధరలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. ఆయా వస్తువుల ధరలను సైతం నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో తాజాగా పలు రాష్ట్రాల్లోని పెట్రోల్ ధరలను విశ్లేషిద్దాం..
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళలో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. దేశం మొత్తంలో ఇవే టాప్ కాగా చిన్న రాష్ట్రాలు అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత చౌక రేట్లకే దొరుకుతోంది. స్థానిక ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత టాక్స్(VAT) వల్ల ఆయా రాష్ట్రాల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని 3 పెట్రోల్ రిటైలర్లు గతవారం ధరలను దాదాపు 2 రూపాయల మేర తగ్గించడంతో మరోసారి పెట్రోల్ ధరల అంశం చర్చకు వచ్చింది.

ఈ తగ్గింపు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నా.. వ్యాట్ అధికంగా ఉండడంతో ఇప్పటికీ పెట్రోల్ ధరలు వంద రూపాయలకు పైనే ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 109.87, కేరళలో 107.54, తెలంగాణలో 107.39 చొప్పున కొనసాగుతున్నాయి. BJP పాలిత రాష్ట్రాలు భోపాల్ లో 106.45, పాట్నాలో 105.16కు చేరుకున్నాయి. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీలు హవా సాగిస్తున్న చోట్ల తక్కువగా ఉన్నాయి. ఇక అండమాన్ దీవుల్లోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ధరకే పెట్రో ఉత్పత్తులు లభిస్తున్నాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు మూడూ తమ మార్జిన్లను లీటరుకు 1.7-2.7 నుంచి 0.8-0.9 మేర తగ్గించుకున్నట్లు గోల్డ్ మన్ సాక్స్ పేర్కొంది. చూసేందుకు 2 రూపాయలు తక్కువ మొత్తమే అయినప్పటికీ వార్షిక ప్రాతిపదికన వాటి రెవెన్యూ 30 వేల కోట్లకు పైగా తగ్గుతుందని JP మోర్గాన్ అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications