పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: మూణ్ణెళ్లలో రూ.2.5 లక్షల కోట్లు, 2014 నుండి ఎంత పెరిగిందంటే?
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజు ధరలు పెరిగాయి. నేడు (ఆదివారం, జూన్ 14) లీటర్ పెట్రోల్ పైన 62 పైసలు, లీటర్ డీజిల్ పైన 64 పైసలు పెరిగింది. గత ఆదివారం (7 వ తేదీ) నుండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ పైన ఈ ఎనిమిది రోజుల్లో రూ.4.52, లీటర్ డీజిల్ పైన రూ.4.64 పెరిగింది. అంటే దాదాపు రూ.5 పెరిగింది. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్, లోకల్ సేల్స్ ట్యాక్స్‌ను బట్టి వివిధ రాష్ట్రాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

ఏ నగరంలో ఎంత ధర
నేడు పెరిగిన అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.75.78, లీటర్ డీజివల్ రూ.74.03గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 83.70, డీజిల్ రూ. 72.64, కోల్‌కతాలో పెట్రోల్ రూ.77.64, డీజిల్ రూ.69.80గాఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.79.53, డీజిల్ రూ.72.18గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.78.67, డీజిల్ రూ.72.36, బెంగళూరులో పెట్రోల్ రూ.78.23, డీజిల్ రూ.70.39గా ఉంది.

2014 నుండి ఎంత పెరిగిందంటే
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ 40 డాలర్లకు అటు ఇటుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ తగ్గి చమురు ధరలు భారీగా పడిపోయాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాట్లాడుతూ... 2014 మే నుండి పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ వరుసగా 258 శాతం, 819 శాతం పెరిగిందని మండిపడ్డారు. అయితే శివసేన నేత ప్రియాంక చతుర్వేది కూడా ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయని, అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. అయితే గత యూపీఏ హయాంలో ధరలు పెంచకుండా చేసిన అప్పులు తీర్చినట్లు కమలనాథులు చెబుతుంటారు.

రూ.2.5 లక్షల కోట్లు ఆర్జించింది
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుడిపై ప్రభుత్వం భారం మోపుతోందని, ఇలా అధిక పన్నులు వసూలు చేస్తూ మార్చి 5వ తేదీ నుంచి రూ.2.5 లక్షల కోట్లు సంపాదించిందని కాంగ్రెస్ నేతలు శనివారం ఆరోపించారు. ముడి చమురు ధరలు 15 ఏళ్ల కనిష్టానికి చేరుకున్నప్పటికీ అయినా ధరలు పెరుగుతున్నాయన్నారు. తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని వాహన వినియోగదారులకు అందించడానికి బదులు పెంచారని కపిల్ సిబాల్ అన్నారు.


Click it and Unblock the Notifications