Petrol price: దేశవ్యాప్తంగా క్యాబ్‌లు, డెలివరీ సర్వీసులు బంద్! ఎప్పుడంటే?
సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 3 రూపాయల వరకు పెంచేశాయి. ఈ అకస్మాత్తు పెంపుతో వాహనదారులు విలవిలలాడుతుండగా.. రోజంతా రోడ్లపైనే ఉంటూ బతికే గిగ్ వర్కర్లు (యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఇంధన ధరలు, యాప్ కంపెనీల తక్కువ చెల్లింపులకు నిరసనగా శనివారం దేశవ్యాప్త తాత్కాలిక సమ్మెకు పిలుపునిచ్చారు.

నేడు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు బంద్!
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేయాలని కార్మికులను కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) ద్వారా యూనియన్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఎంత కష్టపడినా పెరుగుతున్న petrol price వల్ల తమకు రోజువారీ ఖర్చులు కూడా వెళ్లడం లేదని, అందుకే ఈ ఐదు గంటల పాటు నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 110.8.. చుక్కలు చూపిస్తున్న రేట్లు!
తాజా సవరణ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 కి, డీజిల్ రూ. 90.67 కి చేరింది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో ఈ వాత మరింత గట్టిగా తగిలింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.3 పెరిగి.. రూ. 110.8 కి చేరుకుంది (ఇంతకుముందు రూ. 107.45 - రూ. 107.5 పరిధిలో ఉండేది). అలాగే డీజిల్ ధర కూడా రూ. 3.2 పెరిగి లీటరుకు రూ. 98.9 కి చేరింది. అంతర్జాతీయంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకాలు కలగడమే దీనికి ప్రధాన కారణం. గతంలో బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్లు ఉంటే.. ఇప్పుడు అది ఏకంగా 105 డాలర్లకు పైగా పెరిగింది.
సంపాదన అంతా పెట్రోల్‌కే.. మాకేం మిగలట్లేదు!
ఈ ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "పెట్రోల్ ధరలు పెరిగిన ప్రతిసారీ మా పెట్టుబడి తక్షణమే పెరిగిపోతుంది. కానీ యాప్ కంపెనీలు కస్టమర్ల నుంచి వసూలు చేసే ఫేర్లు (Fares) మాత్రం పెంచవు. రోజు ముగిసేసరికి కమిషన్లు, పెట్రోల్ ఖర్చులు పోను చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. కనీసం ఇల్లు గడవడమే కష్టంగా మారింది" అని హైదరాబాద్‌కు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.
చమురు సంస్థల అధికారుల సమాచారం ప్రకారం.. మున్ముందు మరికొంత ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నష్టపోతున్నట్లు క్రిసిల్ (Crisil) అంచనా వేసింది. దేశంలో ఏప్రిల్ 2022 తర్వాత ధరలు పెద్దగా మారలేదు (మార్చి 2024 లో కేంద్రం రూ. 2 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం మినహా). ఇప్పుడు మళ్లీ ఇంధన మంటలు ప్రారంభం కావడంతో, గిగ్ వర్కర్లు తమ ఆవేదనను ఈ తాత్కాలిక సమ్మె ద్వారా ప్రభుత్వానికి, యాప్ కంపెనీలకు తెలియజేయాలని డిసైడ్ అయ్యారు.


Click it and Unblock the Notifications