పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్కు దాటిన రాష్ట్రాలు ఇవే...
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (శనివారం, జూలై 10) ఉత్తర ప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోను రూ.100 క్రాస్ చేసింది. లీటర్ పెట్రోల్ పైన నేడు 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 26 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.91, లీటర్ డీజిల్ రూ.89.88గా ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో పెట్రోల్ రూ.100 దాటింది. చత్తీస్‌గఢ్‌లోని కాంకెర్, జాష్‌పూర్, నారాయణ్‌పుర్ జిల్లాల్లో, నాగాలాండ్‌లోని కోహిమా జిల్లాలో సెంచరీ దాటింది.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి నగరం భోపాల్. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురంలలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. గతవారం తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెట్రోల్ రికార్డు మార్కును క్రాస్ చేసింది. జూలై నెలలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు కూడా ఈ జాబితాలో చేరాయి.

మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, లడక్, బీహార్, కేరళ, తమిళనాడు, సిక్కిం, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సెంచరీ దాటింది. రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ గరిష్టస్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో అత్యధికం పన్నులే. కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా 60 శాతం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications