ఢిల్లీలో కూడా రూ.100 దాటిన పెట్రోల్ ధర, నేడు మళ్లీ పెరిగింది
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 7, బుధవారం) మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరాల్లోను పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 17 పైసలు పెరిగింది. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నేటి పెరుగుదలతో అన్ని మెట్రో నగరాల్లో ధరలు రూ.100 దాటింది.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి నగరం భోపాల్. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురంలలో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. గతవారం తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పెట్రోల్ రికార్డు మార్కును క్రాస్ చేసింది. జూలై నెలలో ఢిల్లీ, కోల్‌కతా నగరాలు కూడా ఈ జాబితాలో చేరాయి.

మొత్తం పదహారు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, ఒడిశా, లడక్, బీహార్, కేరళ, తమిళనాడు, సిక్కిం, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నగరాల్లో సెంచరీ దాటింది. రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డీజిల్ గరిష్టస్థాయికి చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో అత్యధికం పన్నులే. కేంద్ర, రాష్ట్రాల పన్నుల వాటా 60 శాతం ఉంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications