పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే వినియోగదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడున్న ధరలు చాలా వరకు దిగి వస్తాయనే వాదనలు ఉన్నాయి. దీంతో వాహనదారులు పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే మంచి ఆదాయ వనరు. కాబట్టి దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు వెనుకాడుతున్నాయని చెప్పవచ్చు. కేంద్రం అంగీకరించినా రాష్ట్రాలు అంగీకరించేందుకు దాదాపు సిద్ధంగా లేవు. కేంద్రం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్ ఇప్పట్లో జీఎస్టీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అర్థమవుతోంది.

ఇంధనంపై ఆధారపడటం తగ్గించాలి
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ డిమాండ్ చేస్తోంది. ఇంధనంను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే భారత ఎకానమీకి మంచిదని అసోచామ్ అభిప్రాయపడుతోంది. పెట్రోల్, డీజిల్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తున్నప్పటికీ, ఇలా ఇంధనం పైనే ఆధారపడటాన్ని తగ్గించాలని దీపక్ సూద్ అభిప్రాయపడ్డారు. అలాగే ఒకే మార్కెట్ అనే జీఎస్టీ లక్ష్యం నెరవేరదన్నారు.

ఇది సరైన సమయం కాని కాంగ్రెస్ నేత
అయితే అసోచామ్ డిమాండ్‌కు కాంగ్రెస్, బీజేపీల సమాధానం చూస్తే సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ జీఎస్టీ కిందకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రాలు సుముఖంగా లేవని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇంధనంను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని, కానీ ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయాయని, ఇలాంటి సమయంలో ఈ చర్య సాధ్యం కాదన్నారు. దీనిపై ఇప్పట్లో చర్చ కూడా జరగకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరో రెండేళ్ల పాటు నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు.

బీజేపీది అదే మాట
బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్రం పలుమార్లు ప్రతిపాదించినప్పటికీ రాష్ట్రాలు సుముఖంగా లేవని చెప్పారు. రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్ ప్రధాన ఆదాయవనరుగా ఉందని, కాబట్టి వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేవన్నారు. రాష్ట్రాల సహకారం లేకుండా జీఎస్టీ మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. సమీప భవిష్యత్తులో అవకాశం లేదన్నారు.


Click it and Unblock the Notifications