రెండోరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ తగ్గింపులో అంతలోనే సగం భారం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం పెరిగిన ధరలు, బుధవారం కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. చమురు రంగ మార్కెటింగ్ కంపెనీలు నేడు (మే 5) చమురు ధరలను సవరించాయి. నేడు పెట్రోల్ ధర లీటర్ పైన 19 పైసలు, డీజిల్ పైన 21 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
సవరించిన ధరల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.74, డీజిల్ రూ.81.12కు చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై స్థానిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్ విధిస్తాయి. దీంతో ధరలు మరింత పెరుగుతాయి. ఈ రెండు రోజుల్లో పెట్రోల్ ధరపై 34 పైసలు, డీజిల్ పైన 39 పైసలు పెరిగింది. అంతకుముందు మార్చి 24 నుండి ఏప్రిల్ 15వ తేదీ మధ్య పెట్రోల్ పైన 67 పైసలు, డీజిల్ పైన 74 పైసల భారం తగ్గింది. ఇప్పుడు రెండు రోజుల పెరుగుదలతో నాటి తగ్గింపులో సగం మళ్లీ పెరిగినట్లయింది.

గత ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ పైన రూ.21.58, లీటర్ డీజిల్ పైన రూ.19.18 పెరిగింది. పెట్రోల్ పన్నుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను వాటా 60 శాతంగా ఉంటుంది. డీజిల్‌లో 54 శాతం పన్ను ఉంటుంది. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీని, డీజిల్ పైన రూ.31.80 విధిస్తోంది. సవరించిన ధరల ప్రకారం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.87.98గా ఉంది.


Click it and Unblock the Notifications