న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మళ్లీ..మళ్లీ కొరడా ఝుళిపిస్తూనే వస్తోన్నాయి. రెండు రోజుల స్వల్ప విరామం అనంతరం శుక్రవారం ఇంధన రేట్లను పెంచిన ఆయల్ కంపెనీలు.. శనివారం మరోసారి విరామం ఇచ్చాయి. ఈ విరామం సుదీర్ఘంగా కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. మే 4వ తేదీన తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలను చేపట్టిన తరువాత.. చోటు చేసుకుంటోన్న పరిణామాలను బట్టి చూస్తే మరిన్ని వాతలు లేకపోలేదు.
పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ఈ మార్క్‌ను దాటేసింది కూడా. పెట్రోల్ వెనుకే డీజిల్ కూడా పరుగులు తీస్తోంది. పలు చోట్ల 100 రూపాయల మార్క్‌ను దాటేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌పై 34 పైసల మేర పెరిగింది.. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.99.16, డీజిల్ 89.18 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రేటు 105 మార్క్‌ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.105.24 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 96.72కు చేరింది.

చెన్నైలో పెట్రోల్ రూ.100.13, డీజిల్ ధర రూ.93.72లుగా నమోదైంది. దీనితో దక్షిణాది రాష్ట్రాల అన్ని రాజధానుల్లో పెట్రోల్ 100 రూపాయలను దాటినట్టయింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయలను దాటేసింది. తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి హైదరాబాద్‌లో రూ.103.05 పైసలుగా రికార్డు కాగా.. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.97.20 పైసలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయల లోపు ఉన్న జిల్లా లేకపోవచ్చు.
కోల్‌కతలో పెట్రోల్ రూ.99.07 పైసలు, డీజిల్ ధర రూ.92.03 పైసలకు చేరింది. భోపాల్‌లో పెట్రోల్-107.43, డీజిల్-97.93, బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ 94.54, తిరువనంతపురంలో పెట్రోల్ రూ.101.14, డీజిల్ రూ.95.74 పైసలు, పాట్నాలో పెట్రోల్ రూ.101.21 పైసలు, డీజిల్ రూ.94.52 పైసలుగా ఉంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోలు రేట్లు రికార్డులను బద్దలు కొడుతోంది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయల మార్క్‌ను అధిగమించింది. అక్కడ 110.40 పైసలకు చేరింది. ఇక డీజిల్ కూడా అదే వైపు పరుగులు పెడుతోంది. 102.42 పైసలుగా దాని రేటు నమోదైంది.


Click it and Unblock the Notifications