Oil Prices: పాతాళానికి క్రూడ్ ధరలు.. మోదీ సర్కార్ కనికరిస్తుందా? శుభవార్త ఉంటుందా?
Crude Oil Rates: గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను చమురు కంపెనీలు మార్పులు చేస్తుంటాయి. అయితే ఈ క్రమంలో క్రూడ్ ధరలు ఏకంగా 4 ఏళ్లలో కనిష్ఠానికి చేరటంతో భారతీయ వాహన ప్రియుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీపావళి లోపు రేట్ల తగ్గింపు గిఫ్ట్ మోదీ సర్కార్ అందించాలని ఆశిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి త్వరలో శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పడిపోవడం ఆశలను పెంచుతున్నాయి. వాస్తవానికి డిమాండ్ పడిపోవచ్చనే అంచనాలు క్రూడ్ ఆయిల్ ధరలను దాదాపు 33 నెలల కనిష్ఠానికి తగ్గించాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. డబ్ల్యూటీఐ ముడి చమురు అక్టోబర్ ఫ్యూచర్స్ మంగళవారం 3.5% పడిపోయి బ్యారెల్‌కు 66.34 డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రెంట్ ముడి చమురు నవంబర్ ఫ్యూచర్స్ కూడా బ్యారెల్ 69.70 డాలర్లకు పడిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు 70 డాలర్ల కంటే తక్కువగా 2021 స్థాయికి తగ్గటం గమనార్హం.

ముడి చమురు ధరల పతనానికి అనేక కారణాలు ఉన్నాయి. చైనాలో వినియోగం క్షీణించడం OPEC దృక్పథాన్ని బాగా ప్రభావితం చేసింది. దీని కారణంగా వారి డిమాండ్ అంచనా గత నెలలో కూడా తగ్గింది. ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పెరుగుదల కారణంగా చైనాలో డిమాండ్ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారైన చైనా కొనుగోళ్లను తగ్గిస్తోంది. దీంతోపాటు ఫ్రాన్సిన్ తుపాను కూడా సరఫరాపై ప్రభావం చూపుతోంది.
ఇక భారతదేశం విషయానికి వస్తే.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఈ ఏడాది మార్చిలో ఇంధన ధరలను తగ్గించాయి. మార్చి 14, 2024న పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గింది. ఈ విషయాన్ని ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు IOCL, HPCL, BPCL ప్రకటించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల్లో ఎలాంటి తగ్గింపులను వారు వాహనదారులకు అందించలేదు. అయితే క్రూడ్ ఆయిల్ భారీగా పతనం కావడంతో ఇంధన ధరలు తగ్గుతాయన్న అంచనాలు మరోసారి పెరిగాయి. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దిల్లీలో పెట్రోల్ లీటరు రూ.94.72కి విక్రయిస్తున్నారు. ఇందులో బేస్ ధర రూ.55.46 ఉండగా సరకు రవాణాకు 20 పైసలు, ఎక్సైజ్ టాక్స్ రూ.19.90, వ్యాట్ రూ.15.39, డీలర్ కమిషన్ రూ.3.77 అంతర్లీనంగ్ కలిగి ఉన్నాయి. ఇదే క్రమంలో లీటరు డీజిల్ ధర రాజధానిలో రూ.87.62కి విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications