భారతదేశ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించే సంకేతాలు కనిపిస్తున్నాయి.ముడి చమురు ధరలు త్వరలో తగ్గవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్థిరంగా ఉంటే, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరోసారి అన్నారు. ముడి చమురు తక్కువగా ఉంటే, ధరలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
స్థిరమైన సరఫరా, నిల్వల విడుదల, బలహీనమైన ప్రపంచ డిమాండ్‌ను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ.. ముడి చమురు ధర 2 నుండి 3 నెలల పాటు స్థిరంగా ఉంటే, సామాన్యులకు పెట్రోల్, డీజిల్ విషయంలో పెద్ద ఉపశమనం లభించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి. పెరుగుతున్న డిమాండ్ ఉన్నప్పటికీ, చమురు సరఫరా తగినంతగా ఉందని సింగ్ తెలిపారు.
ఇంధన దిగుమతి వ్యూహం కారణంగా చమురు ధరలు తగ్గవచ్చని పెట్రోలియం మంత్రి అన్నారు. కొత్త చమురు వనరులు పెరుగుతున్నందున, ధరలు తగ్గుతాయి. మనకు తగినంత చమురు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ దేశాల నుండి చమురు కొనుగోలు చేస్తోందని చెప్పుకొచ్చారు.

అమెరికా ఆంక్షల ఆందోళనలపై కేంద్ర మంతరి మాట్లాడుతూ..మేము దానిపై ఆందోళన చెందడం లేదు. ఏదైనా జరిగితే, మేము దానిని సమర్ధవంతంగా ఎదుర్కొంటాము. ఒక తలుపు మూసుకుంటే.. మరొక తలుపు తెరుచుకుని ఉంటుందని తెలిపారు. ఒకవేళ అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు.. భారతదేశానికి రష్యా నుండి చమురు సరఫరాలను ప్రభావితం చేస్తే ఇతర దేశాల నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుందని తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో.. రష్యా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే రష్యన్ ఎగుమతులను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి విదితమే. దీంతో చమురు కొనుగోలు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను భారత్ అన్వేషిస్తోంది. గయానా, బ్రెజిల్ మరియు కెనడా వంటి దేశాల నుండి చమురు కొనుగోలు చేసేందుకు రెడీ అయింది.ఇదే విషయంపై మంత్రి మాట్లాడుతూ.. మేము చమురు దిగుమతుల వనరులను పెంచాము. గతంలో మేము 27 దేశాల నుండి చమురు కొనుగోలు చేస్తే ఆ సంఖ్య ఇప్పుడు 40 దేశాలకు పెరిగిందన్నారు.
ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులు స్వల్పంగా పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ రష్యా నుండి మొత్తం కొనుగోళ్లలో సగభాగాన్ని కొనుగోలు చేశాయి. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం..రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. మొత్తం సరఫరాలో 35 శాతం రష్యా నుంచే వస్తోంది. దీని తర్వాత ఇరాక్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చమురు సరఫరాను చేసుకుంటోంది భారత్.


Click it and Unblock the Notifications