13 రోజుల్లో రూ.7కు పైగా పెరిగిన పెట్రోల్ ధరలు, గ్లోబల్ మార్కెట్లో జూమ్
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 13వ రోజు పెరిగాయి. జూన్ 7వ తేదీ నుండి వరుసగా ధరలు పెరగడంతో ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ పైన రూ.7.11, లీటర్ డీజిల్ పైన రూ.7.67 పెరిగింది. ఈ రోజు (జూన్ 19, శుక్రవారం) పెట్రోల్ లీటర్ పైన 56 పైసలు, డీజిల్ పైన 63 పైసలు పెరిగింది. కరోనా-లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

వివిధ నగరాల్లో ధరలు
వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.78.37, డీజిల్ రూ.77.06, కోల్‌కతాలో పెట్రోల్ రూ.80.13, డీజిల్ రూ.72.53, ముంబైలో పెట్రోల్ రూ.85.21, డీజిల్ రూ.75.53, చెన్నైలో పెట్రోల్ రూ.81.82, డీజిల్ రూ.74.77గా ఉంది. హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ రూ.81.36, డీజిల్ రూ.75.31గా, అమరావతిలో పెట్రోల్ రూ.81.76, డీజిల్ రూ.57.73, విజయవాడలో పెట్రోల్ రూ.81.36, డీజిల్ రూ.75.36గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లోను క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.19% పెరిగి 41.57 డాలర్లకు చేరుకుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) ధర బ్యారెల్‌కు 0.28% పెరిగి 38.97 డాలర్లకు చేరుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురురంగ కంపెనీలు ప్రతిరోజు సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు ఈ ధరలు సవరిస్తాయి.

చమురు ధరలు భారీగా పడిపోయి, క్రమంగా పెరుగుతూ
ఫిబ్రవరి 21న బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 59 డాలర్ల వరకు ఉంది. ఆ తర్వాత కరోనా కారణంగా వరల్డ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 21న 9 డాలర్లకు పడిపోయింది. అంటే 85 శాతం తగ్గింది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసి, కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో చమురు ధరలు 40 డాలర్లకు చేరుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో చమురు దిగుమతులు వ్యాల్యూపరంగా 12 శాతం పడిపోయాయి. వ్యాల్యూపరంగా 63 శాతం తగ్గింది. కానీ ఆ సమయంలో లాక్ డౌన్ కారణంగా వినియోగదారుడు ప్రయోజనం పొందలేదు. ఇప్పుడు చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పెరుగుతున్నందున చమురు ధరలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications