వరుసగా 3వ రోజు పెట్రో భారం: హైదరాబాద్, అమరావతి సహా వివిధ నగరాల్లో ఎంతంటే?
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం పెట్రోల్ లీటర్ పైన 25 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. నేటి (ఫిబ్రవరి 11, గురువారం) పెరుగుదలతో లీటర్ పెట్రోల్ రూ.87.85కు, లీటర్ డీజిల్ రూ.78.03కు చేరుకుంది. వరుసగా మూడు రోజులు పెరగడంతో మెట్రో నగరాల్లో ధరలు కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది.

వివిధ నగరాల్లో ధరలు
పెట్రోల్ లీటర్ పైన 25 పైసలు పెరగడంతో ఢిల్లీలో రూ.87.85గా ఉంది. డీజిల్ పైన 30 పైసలు పెరగడంతో లీటర్ రూ.77.73 నుండి రూ.78.06కు చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర ముంబైలో రూ.94.36, చెన్నైలో రూ.90.18, కోల్‌కతాలో రూ.89.16, హైదరాబాద్‌లో రూ.91.35కు, బెంగళూరులో రూ.90.78, అమరావతిలో రూ.93.99కు చేరుకుంది. లీటర్ డీజిల్ ముంబైలో రూ.84.94, చెన్నైలో రూ.83.18, కోల్‌కతాలో రూ.81.61, హైదరాబాద్‌లో రూ.84.94కు, బెంగళూరులో రూ.87.11, అమరావతిలో రూ.87.25కు చేరుకుంది.

ఇటీవల వరుసగా పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గత కొంతకాలంగా వారానికి రెండుమూడు రోజులు ధరలు పెరుగుతున్నాయి. మిగతా రోజుల్లో ధరలలో మార్పు ఉండటం లేదు. వరుస చమురు ధరల పెరుగుదలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వరుసగా మూడు రోజులు ధరలు పెరిగాయి.

అంతర్జాతీయంగా వరుస పెరుగుదల
2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు జనవరి 6, 2021 నుండి పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా నుండి క్రమంగా కోలుకోవడం, ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటి వివిధ కారణాలతో చమురు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా, జాతీయంగా పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షిస్తాయి.


Click it and Unblock the Notifications