అక్కడ జంప్, ఇక్కడా జంప్: 2 నెలల్లో 10 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం (జూలై 04) పెరిగాయి. నేడు లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 18 పైసలు పెరిగింది. గత రెండు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 34వసారి. మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 10 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. పలుచోట్ల రెండు నెలల క్రితం రూ.90 వద్ద ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.100 దాటి రూ.110ని కూడా క్రాస్ చేసింది. గత రెండు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లోను పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

అక్కడ పెరిగింది.. ఇక్కడా పెరిగింది
మే 4వ తేదీ నుండి జూలై 4వ తేదీ మధ్య పెట్రోల్ ధరలు 10.07 శాతం (రూ.9.11), డీజిల్ లీటర్ పైన 10.68 శాతం (రూ.8.63) పెరిగింది. ఇదే రెండు నెలల కాలంలో బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 10.58 శాతం పెరిగింది. అంటే అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇక్కడ పెరిగింది. గత శుక్రవారం 76.17 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలను సవరిస్తాయి చమురు రంగ మార్కెటింగ్ కంపెనీలు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరల సవరణ ఉంటుంది.

ఢిల్లీలో రూ.100కు చేరువలో
తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.51, కోల్‌కతాలో రూ.99.45గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.89.36, కోల్‌కతాలో రూ.92.27గా ఉంది. వివిధ రాష్ట్రాల్లో పన్నులు, కేంద్ర పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

ఇక్కడ రూ.100 క్రాస్
ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.105.58 కాగా, లీటర్ డీజిల్ రూ.96.91గా ఉంది. అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.110.77, లీటర్ డీజిల్ రూ.102.60గా ఉంది. రూ.100 దాటిన నగరాల్లో ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్‌మగ్‌లూరు, శివమొగ్గ, హైదరాబాద్, లెహ్, ఇంపాల్, బారాముల్లా తదితర ప్రాంతాల్లో రూ.100 దాటింది.


Click it and Unblock the Notifications