వాహనదారులకు బిగ్ షాక్.. నవంబర్లో పెట్రోల్ ధరల పెంపు.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంచలన నివేదిక..
Petrol, Diesel Price Hike in November? వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం కాకముందే.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచే దిశగా అడుగులు వేసే అవకాశముందని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంచలన నివేదికను వెలువరించింది. బ్లూమ్బెర్గ్ లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ నవంబర్ చివరి వారమే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను మితంగా పెంచడానికి ప్రభుత్వానికి ఉన్న చివరి వాస్తవిక అవకాశమని ఆ సంస్థ స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది మార్చి, మే నెలల మధ్య ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారం వేడెక్కితే ధరల పెంపు రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధ మేఘాల కారణంగా గతేడాది మే నెలలో దేశీయంగా అమలు చేసిన 7.5 శాతం పెంపులో, దాదాపు సగం (సుమారు 3.5% నుండి 4%) మేర ప్రతిపాదిత పెంపు ఉండవచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సీనియర్ ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హెర్మాన్ ప్రసాద్ విశ్లేషించారు.

ఒకవేళ నవంబర్లో ప్రభుత్వం ఇంధన ధరలను పెంచితే.. అది దేశీయ ద్రవ్యోల్బణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి, 2027 మొదటి త్రైమాసికంలో ఏకంగా 6.5 శాతానికి ఎగబాకే అవకాశముంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన 2% నుండి 6% పరిమితిని దాటిపోనుంది. సెప్టెంబర్లోనే ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగిన నేపథ్యంలో.. నవంబర్ పెంపు అమలైతే ఆర్బీఐ తన రాబోయే సమీక్షల్లో వడ్డీ రేట్లను (Repo Rate) మళ్లీ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అంచనాలు ఆర్బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 5.2 శాతంగా అంచనా వేయగా.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ఇది 5.4 శాతానికి చేరుతుందని పేర్కొంది. కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయి అస్థిరతను అదుపు చేయడంలో సహాయపడుతున్నప్పటికీ, పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరలు రూపాయిపై నిరంతర ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నాయి.
మరోవైపు, పండుగలు, ప్రయాణాల సీజన్లో విమాన టిక్కెట్ల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు తీవ్రమైన ఊగిసలాటకు గురికావడం పెద్ద సవాలుగా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. టిక్కెట్ల భారం తగ్గాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) మరియు విమానయాన సంస్థలు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు రావాలని, వారి మధ్య సమన్వయం కుదిర్చేందుకు తమ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
