పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన.. వాహనదారులకు తిప్పలు తప్పవన్న కేంద్ర మంత్రి..
Petrol, Diesel Price Cut: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న సామాన్య వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నిరాశాజనక సంకేతాలు ఇచ్చింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల కారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని, అందువల్ల తక్షణమే రిటైల్ ఇంధన ధరలను తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. సోమవారం చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఉమ్మడి నష్టాలు వాటిల్లాయని మంత్రి వివరించారు. రిటైల్ ధరల తగ్గింపుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, చమురు కంపెనీలు ఈ భారీ నష్టాల నుండి కోలుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచే ఇంధన ధరలు తగ్గాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ దశలో అది సాధ్యం కాదని సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఈ నెల (నవంబర్) 8న అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కరోజులోనే 3 శాతం పెరిగినప్పటికీ, ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా దేశీయంగా ధరలను స్థిరంగా ఉంచామని గుర్తు చేశారు.

వినియోగదారులకు తక్షణ ఉపశమనం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతో కీలకమని మంత్రి నొక్కి చెప్పారు. ఇంధనంపై రాష్ట్రాలు విధిస్తున్న పన్నులను (VAT) తగ్గించుకుంటే ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని సూచించారు. ఇటీవల కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా గొలుసులో భారత్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని అంగీకరించిన మంత్రి.. వీలైనంత త్వరగా సాధారణ సరఫరా పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. అయితే, ధరలు ఎప్పుడు తగ్గుతాయనే దానిపై మాత్రం ఆయన ఎటువంటి నిర్దిష్ట గడువును ప్రకటించలేదు.
మరోవైపు, అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) విడుదల చేసిన తాజా నివేదిక భవిష్యత్తుపై కొంత ఆశాజనక సంకేతాలను ఇస్తోంది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల కూటమి OPEC+ అక్టోబర్ నెలలో తన ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 2.04 మిలియన్ బారెల్లు పెంచి, మొత్తం 41.2 మిలియన్ బారెళ్లకు చేర్చింది. దీనివల్ల ఉత్పత్తి స్థాయి యుద్ధానికి ముందు నాటి స్థాయిలో 97 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి సభ్య దేశాలు 15 మిలియన్ బారెళ్ల డీజిల్‌తో సహా మొత్తం 71 మిలియన్ బారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి.
నాల్గవ త్రైమాసికంలో ప్రపంచ చమురు సరఫరా డిమాండ్‌ను మించిపోయే అవకాశం ఉన్నందున అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలపై తగ్గుదల ఒత్తిడి ఏర్పడుతుందని ఐఈఏ అంచనా వేస్తోంది. అయినప్పటికీ.. దేశీయ చమురు కంపెనీల నష్టాల భర్తీ పూర్తయ్యే వరకు భారత వినియోగదారులు ధరల తగ్గింపు కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
