దీపావళి కానుక: సామన్యునికి కేంద్రం పెట్రోల్ ఊరట, ఇక రాష్ట్రాల వంతు!
దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో భారత్‌లోను ధరలు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని గంగానగరంలో లీటర్ పెట్రోల్ రూ.120 పైన, హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో రూ.114కు పైన ఉంది. దాదాపు దేశమంతా పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. పెట్రోల్ కూడా చాలా ప్రాంతాల్లో రూ.110 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోను ధరలు పెరుగుతున్నాయి. ఇది కస్టమర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ధరలు తగ్గాయ్..
లీటర్ పెట్రోల్ పైన రూ.5 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు, డీజిల్ పైన రూ.10 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపు గురువారం నుండి అమల్లోకి వస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.5, రూ.10 తగ్గుతుంది. అంటే కొన్నిచోట్ల పెట్రోల్ ధరలు రూ.100 దిగువకు చేరుకుంటాయి. పెట్రోల్ కంటే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని అధికంగా తగ్గించింది. ఇది ఎంతో ప్రయోజనకరం. రాబోయే రబీ సీజన్‌లో రైతులకు ఉపయోగకరం. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తే వినియోగదారులకు మరింత ఊరట దక్కుతుందని పలువురు చెబుతున్నారు.

ఇక రాష్ట్రాల వంతు
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎక్కువగా పన్నులు ఉన్నాయి. ఇందులో ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువగా ఉంది. అందుకే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలుచోట్ల లీటర్ పెట్రోల్ రూ.120 దాటింది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రూ.114 దాటింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంధనం పైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ సామాన్యునికి ఊరట ఇచ్చింది. ఇప్పుడు ఇక రాష్ట్రాల వంతు అంటున్నారు. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించి, సామాన్యునిపై మరింత బరువును తగ్గించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో రూ.110 దిగువకు
పెట్రోల్, డీజిల్ ధరలు నిన్నటి వరకు వరుసగా వారం రోజులు పెరిగాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110 క్రాస్ చేసింది. హైదరాబాద్ నగరాల్లో రూ.114 పైనే ఉంది. లీటర్ పెట్రోల్ పైన రూ.5 ఎక్సైజ్ సుంకం తగ్గడంతో రేపటి నుండి ఇక్కడ రూ.110 దిగువకు వస్తుంది. అక్టోబర్ నెల నుండి లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ.8కు పైగా పెరిగింది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.110.04, లీటర్ డీజిల్ రూ.98.42గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.115.85గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.106.62గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.110.49, డీజిల్ రూ.101.56, చెన్నైలో పెట్రోల్ రూ.106.66, డీజిల్ రూ.102.59, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.49, డీజిల్ రూ.107.40గా ఉంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.122.36, లీటర్ డీజిల్ రూ.112.71గా ఉంది.


Click it and Unblock the Notifications