అక్కడ రూ.110 దాటిన పెట్రోల్ ధర, ముంబైలో రూ.105 సమీపానికి...
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (మంగళవారం, జూన్ 29) పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 34 పైసల నుండి 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 28 పైసల నుండి 30 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో ఇంధన ధరలు మరోసారి సరికొత్త రికార్డును తాకాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.81కి చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. డీజిల్ ధరలు రూ.88.18 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.90గా లీటర్ డీజిల్ ధర రూ.96.72గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.80, డీజిల్ రూ.93.72, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.98.64, లీటర్ డీజిల్ రూ.92.03గా ఉంది. మే 4వ తేదీ నుండి పెట్రోల్ ధరలు పలు నగరాల్లో రూ.100 దాటాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, మణిపూర్, జమ్ము కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో రూ.100 దాటింది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర న్యూయార్క్ నగరంతో పోలిస్తే దాదాపు రెండింతలు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు రూ.100 కంటే పైకి చేరాయి. పెట్రోల్, డీజిల్ పైన రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్, ట్యాక్స్ ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ ట్యాక్స్ ఉంది.


Click it and Unblock the Notifications