9 నెలల కనిష్టానికి... పెట్రోల్, డీజిల్ వినియోగం మేలో ఎంత తగ్గిందంటే?
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాది కరోనా ప్రారంభంలో దాదాపు మూడు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా చమురు డిమాండ్ భారీగా పడిపోయింది. ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా 2021 మే నెలలోను క్షీణించింది. చమురు డిమాండ్ తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకుంది. మే నెలలో చమురు డిమాండ్ 15.1 మిలియన్ టన్నులకు పడిపోయింది. అంతకుముందు నెల (ఏప్రిల్)తో పోలిస్తే 11.3 శాతం క్షీణించింది. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) నివేదిక వెల్లడిస్తోంది.

ఇంధన తగ్గుదల
గత ఏడాది(2020) మే నెల నుండి దేశవ్యాప్తంగా పలుమార్లు లాక్ డౌన్‌లు, కరోనా ఆంక్షలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పైన, కార్యకలాపాల పైన ప్రభావం పడింది. అందుకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం క్షీణించింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం 1.5 శాతం మేర క్షీణించి 15.1 మిలియన్ టన్నులకు పడిపోయినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ వెల్లడించింది. గత ఏడాది 11.3 శాతం ఇంధనం తగ్గిందని తెలిపింది.

గత ఏడాదితో పోలిస్తే
కరోనా నేపథ్యంలో ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్ విధించిన దేశాల్లో భారత్ ముందు ఉంది. దీంతో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య పెరగడంతో సెకండ్ వేవ్ దృష్ట్యా ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు విధించాయి. దీంతో గత ఏడాది మాదిరి పర్సనల్ మొబిలిటీ పెద్దగా నిలిచిపోలేదు. పలు కంపెనీలు యధావిధిగా పని చేశాయి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాపై అంతగా ప్రభావం పడలేదు.

పెట్రోల్, డీజిల్ ఎంతంటే
గత ఏడాదితో పోలిస్తే గత నెలలో 1.99 మిలియన్ టన్నుల పెట్రోల్ వినియోగం కనిపించింది. గ ఏడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువే. ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోలిస్తే మాత్రం 16 శాతం, కరోనా ముందుస్థాయితో పోలిస్తే 27 శాతం తక్కువ. డీజిల్ విక్రయాలు స్వల్పంగా 5.53 మిలియన్ టన్నులకు పెరిగాయి. అయితే ఏప్రిల్ నెలతో పోలిస్తే 17 శాతం, కరోనా ముందుస్థాయితో పోలిస్తే 29 శాతం తక్కువ.


Click it and Unblock the Notifications