Layoffs: భవిష్యత్తులో ప్రోగ్రామర్ల అవసరం తగ్గుతుందా? ఏఐ కంపెనీలు ఏమంటున్నాయంటే..
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పెద్ద ఎత్తున లేఆఫ్స్ (Layoffs) వస్తాయని, లక్షలాది మంది నిరుద్యోగులవుతారని అందరూ భయపడుతుంటే, ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పర్ ప్లెక్సిటీ' (Perplexity) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న అంశంపై పర్‌ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాసన్ మాట్లాడూ.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం ఒక రకంగా మంచిదేనని, ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది తమకు నచ్చని పనులనే చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్న వ్యాపారాలకు ఇదే సరైన సమయం
అరవింద్ శ్రీనివాస్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ అనేది కేవలం ఉద్యోగాలను ఊడగొట్టే సాధనం కాదు, అది ఒక కొత్త అవకాశాల గని. "చాలా మంది తమ ఉద్యోగాలను ఎంజాయ్ చేయడం లేదు. ఏఐ టూల్స్ సహాయంతో ఇప్పుడు ఎవరైనా సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు (Mini businesses) ప్రారంభించవచ్చు" అని ఆయన సూచించారు. ఇన్‌స్టాగ్రామ్ లో అనవసరంగా టైమ్ వేస్ట్ చేసే బదులు, ఏఐ టెక్నాలజీని నేర్చుకుంటే ఆర్థిక స్వయంసమృద్ధి సాధించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. జెఫ్ బెజోస్, ఎన్విడియా వంటి దిగ్గజాల మద్దతు ఉన్న పర్ ప్లెక్సిటీ సంస్థ, ఏఐ ద్వారా కొత్త స్టార్టప్ లు ఎలా పుట్టుకొస్తాయనే అంశంపై పరిశోధనలు చేస్తోంది.
ఏ ఉద్యోగాలకు ముప్పు? ఏవి సేఫ్?
మరోవైపు, ఏఐ ప్రభావంపై 'ఆంత్రోపిక్' (Anthropic) సంస్థ చేసిన తాజా అధ్యయనం కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. శారీరక శ్రమతో కూడిన పనులు, మనుషుల నిర్ణయాధికారం అవసరమయ్యే రంగాలు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాయి.
- సురక్షితమైనవి: వ్యవసాయం, నిర్మాణం (Construction), రిపేర్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్టేషన్, పర్సనల్ కేర్.
- ముప్పు పొంచి ఉన్నవి: సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ.
ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుతం దాదాపు 75% ప్రోగ్రామింగ్ పనులను, 67% డేటా ఎంట్రీ పనులను ఏఐ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. చివరకు ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కూడా భవిష్యత్తులో తమ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం తగ్గొచ్చని అంగీకరించారు. కాబట్టి ఏఐ ముప్పు ఉన్న రంగాల్లో ఉద్యోగం చేసేవాళ్లు వేరొక రంగంలోకి మారే అవకాశాలు పరిశీలించడం మంచిది.
మార్పును ఆహ్వానించాల్సిందే
సాంకేతికత మారుతున్నప్పుడు లేఆఫ్స్ (Layoffs) సహజమని, అయితే ఆ మార్పును అందిపుచ్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాల స్వరూపం మారుతుందే తప్ప, అవకాశాలు తగ్గిపోవని అరవింద్ శ్రీనివాస్ వంటి వారు బలంగా నమ్ముతున్నారు. ఏఐని ఒక శత్రువులా కాకుండా, మన పనిని సులభతరం చేసే ఒక అసిస్టెంట్ లా చూస్తే కొత్త పుంతలు తొక్కవచ్చని స్పష్టమవుతోంది. అందుకే టెక్ రంగంలో ఉండేవారు ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యవసరం.


Click it and Unblock the Notifications