Orvakal Mobility Valley: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో నవ్యాంధ్రకు మహర్థశ పట్టింది. ఈ క్రమంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రంతో ముందుకు సాగుతున్న సర్కార్ రోజురోజుకూ కొత్త పెట్టుబడులను ఆకర్షించటంలో వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. దేశంలో తొలి ప్రైవేటు ఎలక్ట్రిక్ వాహనాల పార్కుకు తాజాగా పునాది పడింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెుబిలిటీ వ్యాలీకి ఈ మెగా పెట్టుబడి వచ్చింది. దాదాపు 1200 ఎకరాల విస్త్రీర్ణంలో రూ.1,800 కోట్లతో దీని ఏర్పాటుకు పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్, టీజీ భరత్ నేతృత్వంలో ఇది జరిగిందని తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్కులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక స్థలాలు వంటి అధునాతన సౌకర్యాలు రానున్నాయి.

దీనికి తోడు పార్కులో పనిచేసే ఉద్యోగులు, నివాసితులకు అవసరమైన ఇళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, మాల్స్ వంటి ముఖ్యమైన సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది. పార్క్ నిర్మాణం ద్వారా రూ.13,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఒప్పందం జరిగింది. ఇది ఈవీల రంగంలో ఏపీ పురోగతికి దోహదపడనుంది. ఇదే క్రమంలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని కలిసిన తర్వాత ఇదొక మైలురాయిగా పేర్కొన్నారు.
టెస్లా, ట్రక్కింగ్ టెక్ వంచి ప్రముక కంపెనీలు తమ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉందని జనసేన ట్విట్టర్ ఖాతాలో పవన్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు, పీఎం మోదీల నుంచి దీనికి పూర్తి స్థాయి మద్ధతు లభించిందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న చురుకైన విధానం ప్రపంచ సంస్థలతో దాని సహకారం ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడి రానున్న 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి దోహదపడనుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
పైగా ఈ పార్కులో పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ రూ.300 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్దపెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. దీనికి కొద్దిరోజుల ముందు దేశంలోనే తొలి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవల ఇండీచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్, యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య పెట్టుబడి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీని ద్వారా చిప్ తయారీ రంగంలో రూ.14,000 కోట్ల పెట్టుబడులను కర్నూలు జిల్లా ఆకర్షించింది.


Click it and Unblock the Notifications