IT rate cut: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. 2024 ఏడాదికిగాను అతిత్వరలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ బడ్జెట్‌పై విభిన్న వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కాగా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. అయితే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంతో అంత దూకుడు ప్రదర్శించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కేటగిరీలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూలైలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు తగ్గుతున్న ఆదాయాల గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నారని ఎన్నికల అనంతరం జరిగిన సర్వేలో తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ ద్రవ్యోల్బణ అంచనాల సర్వేలోనూ కుటుంబాల ద్రవ్యోల్బణం మరో 3 నెలలకు 20 మరియు ఏడాదికి 10 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం డెవలప్ కాగా.. వినియోగం మాత్రం సగం వేగంతోనే వృద్ధి చెందిందని సర్వే నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు సేవింగ్స్ పెంచడంతో పాటు వారికి మరింత నాణ్యమైన జీవితాన్ని అందించడంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెడుతుందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. వ్యక్తిగత పన్నులో కోత విధిస్తే అది ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచుతుందని సర్కారు భావిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజల పొదుపును పెంచేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.


Click it and Unblock the Notifications