Income Tax Return: నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. సమయం లేదు మిత్రమా.. జూలై 31 టాక్స్ ఫైలింగ్ చివరి తేదీ
Income Tax Return: 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. అయితే ఈ తేదీని మరింత పొడిగించాలని వినతులు వస్తున్నప్పటికీ ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ పొడిగింపు వస్తుందని మీరు భావిస్తున్నట్లయితే.. చివరి క్షణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

గడువులోపు ITR దాఖలు చేయకపోతే..
గడువు తేదీలోగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే రూ.5,000 ఆలస్య రుసుముతో ITR ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే.. ఐటీఆర్‌కు సంబంధించిన ఏదైనా నిర్లక్ష్యం కారణంగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని టాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ నిపుణులు బల్వంత్ జైన్ తెలిపారు. ఐటీఆర్ దాఖలు చేయకపోతే కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.

ఆదాయం మారితే ఫైన్ మారుతుందా..?
అవును.. ITR ఆలస్య రుసుము విషయంలో మార్పులు ఉన్నాయి. రూ.5 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తి జులై 31 లోపు తన పన్ను ఫైలింగ్ పూర్తి చేయకపోతే ఆలస్య రుసుముగా రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండే వ్యక్తులు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.5,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి.. సమయానికి పన్ను చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయటం ఉత్తమం.

వడ్డీతో పాటు జరిమానా..
గడువు తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారు దానిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని బల్వంత్ జైన్ చెప్పారు. కానీ.. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. "నిర్ణీత తేదీలోగా ITR ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారు ఐటీ నోటీసుకు జవాబు ఇచ్చే తేదీ వరకు పూర్తి పన్ను చెల్లింపు, వడ్డీపై ఆదాయపు పన్ను శాఖ 50 నుంచి 200 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ప్రాసిక్యూషన్ తప్పదా..
సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులను ప్రాసిక్యూట్ చేసే హక్కు భారత ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధన ప్రకారం.. దీనికి కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. అయితే.. ఐటీఆర్ వైఫల్యానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులపై ప్రతి శాఖ దావా వేయదు. పన్ను మొత్తం రూ.10,000 దాటితేనే సదరు శాఖ ప్రాసిక్యూట్ చేయవచ్చని టాక్స్ నిపుణులు వెల్లడించారు. సో.. సమయానికి టాక్స్ ఫైలింగ్ పూర్తి చేయటం ద్వారా చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications